Mithun Reddy: మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) తిరస్కరించింది. దీంతో లిక్కర్ స్కాం వ్యవహారంలో మిథున్ రెడ్డి అరెస్టు కావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణం (Liquor Scam) జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ అభియోగాలు నమోదు చేసింది. ఇన్నాళ్లూ ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టుల్లో విచారణలో ఉండడంతో ఆయన జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో అరెస్టుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మిథున్ రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు నిందితులుగా ఉన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మిథున్ రెడ్డి ఈ కుంభకోణంలో కీలక పాత్ర (A-4) పోషించారని సీఐడీ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టులో వాదించారు. అయితే, మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి, తమ క్లయింట్‌పై ఆధారాలు లేవని, ఆయన మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తిగా దర్యాప్తుకు సహకరిస్తున్నారని వాదించారు.
2025 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని, విచారణాధికారి నుంచి ఎలాంటి పిలుపూ ఆయనకు రాలేదని అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. అయితే, భవిష్యత్తులో పోలీసుల నుండి ఏదైనా చర్య ఉంటే, మిథున్ రెడ్డి చట్టపరమైన రక్షణ కోరవచ్చని సూచించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డిపై తొందరపాటు చర్యలు వద్దన్న సుప్రీంకోర్టు, ఈ అంశంపై హైకోర్టు మరోసారి విచారించాలని సూచించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు., ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం దర్యాప్తు సంస్థకు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అరెస్టు చేసింది.
ఈ కేసు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా అత్యంత సున్నితమైన విషయం. వైసీపీ నాయకులు ఈ దర్యాప్తును రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కేసును నీచమైన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న మద్యం కుంభకోణం కేసును బలహీనపరచడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో, వైసీపీ నాయకులు ఈ దర్యాప్తులో SIT అధికారులు బలవంతంగా నీచమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలతో తమ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, ఈ కేసును వైసీపీ పాలనలో జరిగిన అవినీతికి ఉదాహరణగా చూపిస్తోంది. ఈ కుంభకోణంలో ప్రముఖ వైసీపీ నాయకులు లంచాలు సేకరించి, హవాలా ద్వారా డబ్బును తరలించారని SIT ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు.
హైకోర్టు తీర్పు మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమం చేసినప్పటికీ, ఈ కేసు రాజకీయంగా మరింత ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉంది. వైసీపీ ఈ దర్యాప్తును రాజకీయ ప్రతీకారంగా చిత్రీకరిస్తూ, ప్రజల్లో సానుభూతిని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చు. అదే సమయంలో, ఎన్డీఏ కూటమి ఈ కేసును వైసీపీ అవినీతిని బయటపెట్టే అవకాశంగా ఉపయోగించుకోవచ్చు.