K Santhi: శాంతికి నిర్బంధ పదవీ విరమణ..!? విజయ సాయి ఎఫెక్టేనా..?

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా (assistant commissioner) విధులు నిర్వహిస్తున్న కె.శాంతిపై (K Santhi) రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ పదవీ విరమణ (compulsory retirement) చేయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. విడాకులు (divorce) ఇవ్వకుండానే రెండో పెళ్లి (second marriage) చేసుకోవడం, దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణలో వైఫల్యం లాంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. వీటిపై కొంతకాలంగా విచారణ జరపుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిర్బంధ పదవీ విరమణకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డితో (Vijayasari Reddy) ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనానికి కారణమయ్యాయి.
శాంతి 2013లో మదన్ మోహన్ మణిపాటిని (Madan Mohan) వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి జంట పిల్లలు జన్మించారు. అయితే 2016 నుంచి ఆమె మదన్ మోహన్‌తో కలిసి ఉండట్లేదు. 2020లో ఆమె పోతిరెడ్డి సుభాశ్‌ను (Pothireddy Subhash) వివాహం చేసుకున్నారు. వీరికి ఒక సంతానం కూడా జన్మించినట్లు ఆమె స్వయంగా ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. అయితే మదన్ మోహన్ ఈ వివాహం చట్టవిరుద్ధమని, తనతో విడాకులు తీసుకోకుండానే శాంతి రెండో వివాహం చేసుకున్నారని ఆరోపించారు. మదన్ మోహన్ ఈ అంశాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారికంగా ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు శాంతి గర్భవతి అయ్యారని.. ఆ బిడ్డకు తాను తండ్రి కాదని అందులో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి లేదా సుభాశ్ ఈ గర్భానికి కారణమై ఉండవచ్చని సంచలన ఆరోపణలు చేశారు. శాంతి ఈ ఆరోపణలను ఖండించారు. విజయసాయి రెడ్డితో తనకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. సుభాశ్ ను తాను పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు.
శాంతిపై దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణలో వైఫల్యం ఆరోపణలు కూడా ఉన్నాయి. దేవాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు, ఆలయ ఆస్తులు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల అనేక అక్రమాలకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా శాంతి విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో దేవాదాయ శాఖ అధికారిగా ఉన్న సమయంలో ఆలయ ఆదాయ లెక్కలలో అవకతవకలు, హుండీ లెక్కలలో గందరగోళం వంటి ఆరోపణలు ఆమెపై వచ్చాయి. 2021లో శాంతి డిప్యూటీ కమిషనర్ ఇ.పుష్పవర్ధన్‌పై ఇసుక చల్లిన సంఘటన కూడా ఆమె వివాదాస్పద ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచింది. దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నారు. శాంతి నియామక ప్రక్రియపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మదన్ మోహన్ ఫిర్యాదు ఆధారంగా దేవాదాయ శాఖ కమిషనర్ కె.సత్యనారాయణ, శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆమె వైవాహిక స్థితి, రాజకీయ పార్టీతో సంబంధాలు, ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరారు. శాంతి సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేనందున, ఆమెపై నిర్బంధ పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతిపై కాకుండా కేవలం మదన్ మోహన్ ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకుంటున్నట్టు సమాచారం.