ఆనందయ్య మందుపై.. హైకోర్టులో విచారణ

కరోనాకు నాటు వైద్యాన్ని అందిస్తున్న ఆనందయ్య అంశంపై ఆంధప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదానలను వినిపిస్తూ ఆనందయ్య తన మందుపై ఆయుర్వేద కౌన్సిల్‍లో రిజిస్టర్ చేసుకోలేదని తెలిపారు. ఆనందయ్య మందుపై పరీక్షల నివేదికలు ఈ నెల 29న వస్తాయని తెలిపారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ ఆనందయ్య మందు కోసం ఎంతో మంది ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా నివేదికలు అందజేయాలని సూచించింది. ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్ వాదిస్తూ ఆయన మందును ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించారు. ఆనందయ్యతో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన మందును ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఇరువైపుల వాదనలను విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.