TDP: మరి ఆ ఇద్దరికీ గవర్నర్ పదవుల సంగతేంటి..?

భారతీయ జనతా పార్టీ(BJP)తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న ప్రతిసారి గవర్నర్ పదవుల గురించి ఏదో ఒక వార్త మనం చూస్తూనే ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం గవర్నర్ల సంఖ్య కాస్తా ఎక్కువగానే ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నాయకులు పలు రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఎక్కువమంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ గవర్నర్ పదవితో తలనొప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన మోత్కుపల్లి నరసింహులు నుంచి ప్రస్తుతం ఏపీలో మాజీ మంత్రుల వరకు గవర్నర్ పదవి కోసం ఎదురు చూసేవాళ్లే.
తాజాగా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju)కు గోవా గవర్నర్ గా బాధ్యతలు అప్పగించారు రాష్ట్రపతి. దీనితో మరో ఇద్దరు నేతల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టిడిపిలో కీలక నేతలుగా ఒకప్పుడు చలామణి అయిన వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు గవర్నర్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. 2024 ఎన్నికల్లో తమ వారసులకు సీటు త్యాగం చేసిన ఈ ఇద్దరు.. ప్రస్తుతం ఏ పదవి లేకుండా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం కష్టపడిన నాయకులుగా కూడా వీరికి కాస్త గుర్తింపు ఉంది.
చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడని మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారని చాలామంది భావించారు. ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. ఇక వర్ల రామయ్య రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి ఇప్పటివరకు జరగలేదు. ఈ సమయంలో అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు టిడిపిలో తలనొప్పికి కారణమయ్యాయి అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
వాళ్ళిద్దరూ పదవులు కోసం ఎదురుచూస్తున్న సమయంలో, సైలెంట్ గా అశోక్ గజపతిరాజుకు చంద్రబాబునాయుడు మేలు చేశారు అంటూ టిడిపి అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టే ప్రచారం ఒకటి జరుగుతోంది. వాస్తవానికి ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారంటూ పెద్దగా వార్తలు కూడా రాలేదు. టిడిపి సోషల్ మీడియాలో కూడా ఎటువంటి హడావుడి జరగలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు ఆ విషయం ఎవరికీ తెలియదు కూడా. టిడిపి అగ్ర నాయకత్వానికి కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు.
చంద్రబాబుతో సహా అది కొద్ది మందికి మాత్రమే ఈ విషయంపై క్లారిటీ ఉన్నట్లు సమాచారం. కనీసం ఉత్తరాంధ్ర నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు దీనిపై చర్చించలేదనేది ప్రధానంగా వినపడుతున్న మాట. అనవసరమైన తలనొప్పులు వచ్చే అవకాశం ఉండటంతోనే చంద్రబాబు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఆ ఇద్దరికీ ఎప్పుడు పదవి కేటాయిస్తారో చూడాలి.