Chandrababu: గత పాలన అప్పుల భారం సరిదిద్దే ప్రయత్నం..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు ఆవేదన..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ (YCP) పాలనలో తీసుకున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దారి తప్పిందని, దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తగినంత సమయం కూడా సరిపోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. లెక్కలేకుండా అప్పులు చేశారని, తెచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. కొంత అప్పు మాత్రమే లెక్కల్లో కనిపిస్తోందని, ఇంకా మరెన్నో దాగి ఉన్నాయని అధికారులు చెబుతున్న పరిస్థితి తనను కలవరపెడుతోందని చంద్రబాబు తెలిపారు.
తాజాగా బ్యాంకర్లతో నిర్వహించిన కీలక సమావేశంలో (Bankers’ Meeting) సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఐదు గంటల పాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ఆయన, గతంలో చేసిన అప్పులపై ఇప్పుడు వడ్డీల భారం ఎలా పెరిగిపోయిందో వివరించారు. అప్పట్లో తీసుకున్న రుణాల కారణంగా రాష్ట్రంపై ఏటేటా భారీ వడ్డీ భారం పడుతోందని, దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కష్టమవుతోందని చెప్పారు.
అయితే, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల కొంత ఊరట లభించిందని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని రుణాలను రీషెడ్యూల్ చేయడం ద్వారా సుమారు 1180 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగామని వెల్లడించారు. ఈ మొత్తం ప్రధానంగా వడ్డీల రూపంలో చెల్లించాల్సిన భారం తగ్గినదేనని తెలిపారు. రాష్ట్ర పరపతి మెరుగుపడటంతో బ్యాంకులు వడ్డీ రేట్లలో సడలింపులు ఇచ్చాయని, ఇది ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగించిందన్నారు.
అయితే గత పాలనలో అప్పుల కోసం కార్పొరేషన్లు మాత్రమే కాకుండా ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ బంధనాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీ బ్రాండ్ (AP Brand) తిరిగి బలపడుతున్న నేపథ్యంలో, కీలక రంగాల్లో అభివృద్ధికి బ్యాంకుల సహకారం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాష్ట్ర ఆదాయం పెరగాలంటే సూక్ష్మ, చిన్న వ్యాపారాలు బలోపేతం కావాలని, వాటి లావాదేవీలు పెరగాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. ఇందుకోసం బ్యాంకులు ఎంఎస్ఎంఈ రంగానికి (MSME Sector) విస్తృతంగా రుణాలు అందించి సహకరించాలని కోరారు. వ్యాపార చలనం పెరిగితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని వివరించారు.
ఇక గత పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు, ఎలాంటి ఇంగితం లేకుండా వ్యవస్థలను ఇష్టారాజ్యంగా వాడుకున్నారని ఆరోపించారు. డబ్బులు వస్తే చాలు, వడ్డీ ఎంత అన్నది కూడా పట్టించుకోకుండా అప్పులు తెచ్చారని అన్నారు. చివరికి ఆ భారం ప్రజలపై పడుతుందన్న కనీస ఆలోచన కూడా లేకపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, ప్రభుత్వానికి విశ్వసనీయత దెబ్బతిన్నదని, ఇప్పుడు దాన్ని తిరిగి సంపాదించడమే తమ ముందున్న పెద్ద సవాలని చెప్పారు. భవిష్యత్తులో మరో రెండు లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని, దీనికీ బ్యాంకర్లు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.






