Atchannaidu: బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా? : మంత్రి అచ్చెన్నాయుడు
 
                                    రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే, గదిలో కూర్చొని జగన్ (Jagan)అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. మొంథా తుపాను నేపథ్యం లో కృష్ణా జిల్లా పెనమలూరు, వెంట్రుపగడలో మంత్రి పర్యటించారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియా తో మాట్లాడుతూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఐదు రోజలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, కేవలం విమానం లేదన్న సాకుతో బెంగళూరు (Bangalore) నుంచి రాని వ్యకి, గదిలో కూర్చొని విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పంటల బీమాపై జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. దమ్ముంటే టెలీకాన్ఫరెన్స్ (Teleconference) లో చేసిన వ్యాఖ్యలపై జగన్ చర్చకు రావాలి. వాస్తవ నివేదికలతో మేం కూడా చర్చకు వస్తాం. గత ప్రభుత్వం 40 శాతం కూడా చేయని ఈ క్రాప్ ను మేం 95 శాతం చేశాం. మామిడికి కేజీ రూ.4 ఇచ్చి రూ.300 కోట్లు ఖర్చు పెడితే, మామిడి రైతులను పట్టించుకోలేదని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ బీమా వాటా చెల్లించలేదని సాక్షాత్తు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బహిరంగంగా చెప్పారు. రైతుల ప్రతి విషయంలోనూ అబద్ధాలు ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు అభాసుపాలవుతున్నారు అని అన్నారు.











 
                                                     
                                                        