Chandrababu: నేను నేరస్తుడినా? ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సుదీర్ఘంగా యాభై సంవత్సరాలుగా ప్రజా జీవితం సాగిస్తున్న ఆయనకు రాజకీయ అనుభవం అపారంగా ఉంది. వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చరిత్ర ఆయన సొంతం. ఈ స్థాయికి ఎవరూ చేరలేదు. ఇక బాబు రాజకీయ జీవితాన్ని పుస్తకంలా చూడొచ్చు. ప్రతి పుటలో అనుభవాలే. ప్రత్యర్థులు ఆయన జీవితంలో లోపాలు వెతకడానికి ప్రయత్నిస్తుంటే, ఆయన అభిమానులు మాత్రం “బాబు ఈజ్ గ్రేట్” అంటుంటారు.
అయితే తాజాగా తిరుపతి (Tirupati) పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రజలతో మాట్లాడుతూ ఒక్కసారిగా “నేను నేరస్తుడనా? నేను హత్యలు చేశానా?” అనే ప్రశ్నలు సంధించారు. ప్రజలను ఉద్దేశించి ఇలా మాట్లాడటంతో అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆయన ఈ ప్రశ్నల వెనుక వ్యంగ్యంతో కూడిన సందేశం ఉంది. ఆయన చెప్పదలచుకున్నది స్పష్టం – తాను ఎప్పుడూ స్వచ్చమైన రాజకీయాలు చేశానని, తాను నేరాలకు పాల్పడలేదు.
తన పాలనలో శాంతిభద్రతలు ఎల్లప్పుడూ ప్రాధాన్యం పొందాయని చంద్రబాబు వివరించారు. అసలు తాను విద్యార్థిగా ఉన్న సమయంలో ఎస్వీ యూనివర్శిటీలో (SV University) రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నేర రాజకీయాలు చేసింది లేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యాన్ని వినిపిస్తూ ఆయన పరోక్షంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) పై తీవ్రమైన విమర్శలు చేశారు.
వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్యకు సంబంధించి బాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. “ఆ హత్యను గుండెపోటు అనిపించేందుకు డ్రామాలు ఆడారు” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. వివేకా కుమార్తె వైఎస్ సునీత (Y. S. Sunitha) బహిరంగంగా మాట్లాడటం వల్లే ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటి రాజకీయాలు శుద్ధమైనవిగా లేవని, నేరస్థులు రాజకీయ ముసుగులో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ప్రజలు తిరస్కరించాలని కోరారు. తాను ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే కాదు, లా అండ్ ఆర్డర్‌ను కఠినంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. తన మాటలన్నీ ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అని, తాను ఎప్పుడూ హింసను ప్రోత్సహించనని చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు వదిలిన ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరి దీని పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి..