AP Govt: ప్రమాణ స్వీకారానికి ఏడాది, మరి ప్రచారం ఎక్కడ..?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఐదేళ్లపాటు వైసీపీ పై పోరాటం చేసిన ఎన్డీఏ(NDA) పార్టీలు 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. 164 స్థానాల్లో అధికారంలోకి వచ్చిన కూటమి.. ప్రభుత్వాన్ని ఘనంగా ఏర్పాటు చేసింది. సరిగా ఏడాది క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలుతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతూ వచ్చింది.
2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. తల్లికి వందనం సహా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అమరావతి పనులు ప్రారంభం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పెన్షన్లు ఇచ్చే విషయంలో దూకుడుగానే వెళ్ళింది చంద్రబాబునాయుడు సర్కార్. త్వరలోనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ ఏడాదిలో.. మంత్రులు ఎంతవరకు ప్రచారంలో ముందున్నారు అనేది చెప్పలేని పరిస్థితి.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని నడపడం అనేది సవాల్ తో కూడుకున్న విషయం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కూడా అత్యంత కష్టమైన అంశంగానే చెప్పాలి. అలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే ఏడాది పాలన విషయంలో మంత్రులు మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనుకబడ్డారనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. కనీసం చాలా మంది మంత్రులు మీడియా ముందుకు కూడా రాలేకపోతున్నారనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి.
తమ తమ నియోజకవర్గాల్లో సైతం ప్రచార కార్యక్రమాలను నిర్వహించే విషయంలో వెనుకబడి ఉంటున్నారు. విపక్షాలపై విమర్శలు చేసే సమయంలో కూడా వెనుక పడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా వైసిపి చేస్తున్న కొన్ని ప్రచారాల విషయంలో దూకుడుగా ఉండలేకపోతున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు క్లాస్ పీకిన సరే మంత్రుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదనేది టిడిపి కార్యకర్తలుతో పాటుగా కూటమి పార్టీల కార్యకర్తల ఆవేదన. మరి ఇప్పటికైనా మంత్రుల వ్యవహార శైలిలో మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి.