Super Six 2: రేపే ‘తల్లికి వందనం’ పథకానికి శ్రీకారం: సూపర్ సిక్స్ హామీల్లో మరో మైలురాయి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని ప్రభుత్వం తమ ఎన్నికల హామీలలో భాగమైన సూపర్ సిక్స్ (Super Six) పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో, ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపటి నుంచి (జూన్ 12, 2025) ఈ పథకం అమలులోకి రానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 67,27,164 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.8,745 కోట్ల నిధులను జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతల విమర్శలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది.
‘తల్లికి వందనం’ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందజేయనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అమలు చేసిన ‘అమ్మ ఒడి’ (Amma void) పథకం కింద ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి మాత్రమే రూ.15వేల సహాయం అందేది. అందులోనూ రూ.1000లను ఇతర అవసరాలకోసం కట్ చేసుకుని జమ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని సమూలంగా మార్చేసింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే.. అందరికీ రూ.15,000 చొప్పున అందించేలా రూపొందించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊతం అందించనుంది.
తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా విద్యను ప్రోత్సహించడమే మా లక్ష్యం అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వెల్లడించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుందని వివరించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని చంద్రబాబు సర్కార్ విజయవంతంగా అమలు చేస్తోంది. ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా మరో కీలక హామీని నెరవేర్చడం ద్వారా, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమర్థవంతంగా సమాధానం చెప్పనుంది. వైసీపీ హయాంలో ‘అమ్మ ఒడి’ పథకం పరిమితంగా అమలైన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో విద్యా రంగానికి పెద్ద ఎత్తున ఊతం లభించనుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు, పిల్లల చదువుకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, సూపర్ సిక్స్ హామీల్లో మిగిలిన పథకాలైన అన్నదాత సుఖీభవ, మహిళళకు ఉచిత బస్సు రవాణా.. వంటి కార్యక్రమాలను కూడా త్వరలో అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా, ‘తల్లికి వందనం’ పథకం ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది. ఈ పథకం ద్వారా లక్షలాది తల్లులకు ఆర్థిక సహాయం అందడంతో పాటు, కూటమి ప్రభుత్వం తమ హామీల పట్ల నిబద్ధతను చాటుకుంటోంది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లులు, ఈ పథకాన్ని స్వాగతిస్తున్నారు.