Karnataka: కర్ణాటకలో మూడు ముక్కలైన కాంగ్రెస్ పార్టీ..!
కర్ణాటక కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో పవర్ పాలిటిక్స్ తారస్థాయికి చేరాయి. దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఘనవిజయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు నాయకత్వ మార్పు అంశం పెను తుఫాను రేపుతోంది. 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కుదిరినట్లుగా చెప్పుకుంటున్న అధికార మార్పిడి ఒప్పందం ఇప్పుడు అమలు కావాల్సిందేనంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) వర్గం పట్టుబడుతుండటంతో, రాష్ట్ర రాజకీయం ఢిల్లీ వీధులకు చేరింది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఇది అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు, ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అప్పట్లో హైకమాండ్ మధ్యవర్తిత్వంతో ఒక ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరిగింది. దాని ప్రకారం.. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత మిగిలిన కాలానికి డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకోవడంతో, డీకే శివకుమార్ ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నాయకత్వ మార్పుపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా, గురువారం డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకున్నారు. వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి తమ మనోగతాన్ని వెల్లడించారు. తక్షణం ముఖ్యమంత్రి పగ్గాలను డీకే శివకుమార్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ ఎమ్మెల్యేల బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది. డీకే శివకుమార్ ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. ఇకపై తాను కేవలం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగలేనని, తనకు సీఎం పీఠం కావాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లూ సిద్దరామయ్య, డీకే వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మూడు వర్గాలుగా చీలిపోయారు. సిద్దు, డీకే వర్గాలకు ఖర్గే వర్గం కూడా తోడయ్యింది. సీఎం సిద్ధరామయ్యకు బలంగా మద్దతు ఇస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం పీఠం వదులుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కుల సమీకరణాలు, అహిందా వర్గాల మద్దతు ఆయనకు బలంగా ఉంది. పార్టీని గెలిపించడంలో డీకే కష్టపడ్డారని, ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఖర్గే వర్గం పుట్టుకొచ్చింది. ఇది సరికొత్త పరిణామం. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల తలపోటు మధ్యలో.. తాము ఎవరి వైపూ లేమని, హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటామని ఖర్గే వర్గం చెప్తోంది. ఇది అధిష్టానానికి ఒకరకంగా ఊరటనిస్తూనే, మరోరకంగా సమస్యను జఠిలం చేస్తోంది.
కర్నాటక పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్ కు కత్తి మీద సాములా మారాయి. సిద్ధరామయ్యకు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. వెనుకబడిన వర్గాల మద్దతును కాదని ఆయన్ను తొలగిస్తే, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లవచ్చు. ఇక డీకే శివకుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ గా పనిచేశారు. ఇప్పుడు ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, పార్టీలో అంతర్గత తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. తాను పీసీసీ చీఫ్ గా కొనసాగలేననని డీకే చెప్పడం.. ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో తెలియజేస్తోంది.
మొత్తానికి, రెండున్నరేళ్ల పాలన తర్వాత కర్ణాటక రాజకీయాలు పవర్ పాలిటిక్స్ సుడిగుండంలో చిక్కుకున్నాయి. ఢిల్లీ పెద్దలు సిద్ధరామయ్యను ఒప్పిస్తారా? లేక డీకేకు మరోసారి నచ్చజెప్పుతారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.






