Pulivendula: కంచుకోటలో టెన్షన్ పడుతున్న వైసీపీ..!

కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల (Pulivendula) అనగానే వైఎస్ కుటుంబం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఆధిపత్యం గుర్తుకు వస్తాయి. గల్లీ నుంచి పార్లమెంటు వరకు ఈ ప్రాంతంలో వైసీపీ పట్టు అసాధారణం. వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) వరకూ ఈ ఆధిపత్యం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే, రేపు జరగనున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక (ZPTC by Election) ఈ కంచుకోటను కదిలిస్తుందేమోననే టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ (TDP) ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వైసీపీని దెబ్బతీయాలనే పట్టుదలతో రంగంలోకి దిగింది.
పులివెందుల మండలంలో జడ్పీటీసీ సభ్యుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ తరపున హేమంత్ రెడ్డి, టీడీపీ తరపున బీటెక్ రవి (BTech Ravi) సతీమణి మారెడ్డి లతారెడ్డి, కాంగ్రెస్ సహా ఇతర స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఒక స్థానిక సంస్థ స్థానానికి సంబంధించినవైనప్పటికీ, రాజకీయ ప్రతిష్ట, పార్టీల బలాబలాలను పరీక్షించే అవకాశంగా మారాయి.
పులివెందులలో వైసీపీ ఎప్పుడూ అజేయంగా కనిపిస్తుంది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలోని 52 జడ్పీటీసీ స్థానాల్లో 49 ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో వేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు ఈ జడ్పీటీసీ పరిధిలో 7,000 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి కేవలం 3,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ గణాంకాలు వైసీపీ ఓటు బ్యాంక్ బలాన్ని స్పష్టం చేస్తాయి. అయినా, ఈ ఉప ఎన్నికలో వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది. టీడీపీ గట్టిగా ఫైట్ చేస్తుండడం, కూటమి నాయకులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం, వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌పై దృష్టి సారించడం ఈ ఆందోళనకు కారణంగా చెప్పుకోవచ్చు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో నేరుగా పాల్గొనకపోయినా, బెంగళూరు నుంచి నాయకులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి వంటి నాయకులపై ఆధారపడుతున్న వైసీపీ, ప్రజల సెంటిమెంట్‌ను తమవైపు తిప్పుకునేందుకు మృతుడైన జడ్పీటీసీ సభ్యుడి కుటుంబానికి టికెట్ ఇచ్చింది. అయితే, వైఎస్ కుటుంబంలోని చీలికలు, వివేకానంద రెడ్డి హత్య కేసు వంటి వివాదాలు వైసీపీకి ఇబ్బందిగా మారుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల అనుచరుడు పోటీ చేయడం, స్వతంత్ర అభ్యర్థిగా సునీల్ యాదవ్ బరిలో ఉండటం వైసీపీ ఓటు బ్యాంక్‌ను చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అధికారంలో ఉన్న టీడీపీ ఈ ఎన్నికను జగన్‌కు రాజకీయ హెచ్చరికగా మార్చాలని భావిస్తోంది. టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలో దించి, మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకులతో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 40 మంది కూటమి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, పులివెందులను గెలిచి అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో కృష్ణా జలాలను పులివెందులకు తెచ్చిన ఘనత టీడీపీదేనని, ఇప్పుడు కూటమి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
వైసీపీ ఓటు బ్యాంక్‌పై టీడీపీ దృష్టి సారించింది. గ్రామాల్లో పలుకుబడి ఉన్న నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు ప్రజాస్వామ్య వాతావరణంలో స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి జరిగిందని, టీడీపీ దాడులకు తెగబడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను టీడీపీ ఖండిస్తోంది. వైసీపీ నాయకులు ఓటమి భయంతో డ్రామాలాడుతున్నారని విమర్శిస్తోంది. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 550 మంది పోలీసులతో బందోబస్తు, 15 చెక్‌పోస్టులు, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కేవలం ఒక స్థానిక సంస్థ ఎన్నిక కాదు. ఇది వైసీపీ కంచుకోటలో టీడీపీ సవాల్‌గా మారింది. వైసీపీ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని, టీడీపీ జగన్ గడ్డపై గెలిచి రాజకీయ సందేశం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. పులివెందుల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో ఆగస్టు 12 తర్వాత తేలనుంది.