Love Story: మృత్యువుని గెలిచిన ప్రేమ… మనుషులని ఓడించిన కులం!
“ప్రేమకు సావు లేదు.. దాన్ని చంపేవాడికి గెలుపు లేదు.” ఇది సినిమాల్లో వినిపించే డైలాగ్ మాత్రమే కాదు, ఆధునిక సమాజంలో జరుగుతున్న వాస్తవాలకు అద్దం పడుతున్న నిత్య సత్యం. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చంద్రమండలాన్ని దాటి వెళ్తున్నాం. కానీ, మనషుల మనసు మాత్రం ఇంకా కులమతాల రొచ్చులోనే కూరుకుపోయి ఉందనడానికి మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్ (Nanded)లో జరిగిన ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆంచల్ (Aanchal) అనే యువతి, వేరే కులానికి చెందిన యువకుడిని (Saksham Tate) ప్రేమించింది. కానీ, ఆమె తండ్రికి, సోదరులకు అది నచ్చలేదు. కులం పేరుతో కట్టుకున్న గోడలు కూలిపోతాయని భయపడ్డారు. ఆ భయంతోనే కనీస మానవత్వాన్ని మరిచిపోయి, ఆ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు.
సాధారణంగా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు భయంతోనో, లేదా కుటుంబం మీదున్న మమకారంతోనో అమ్మాయిలు మౌనం వహిస్తారు. కానీ, ఆంచల్ అలా చేయలేదు. తన ప్రేమ పవిత్రమైనదని, ప్రాణం పోయినా ఆ బంధం తెగిపోదని నిరూపించింది. తన కళ్ళ ముందే విగతజీవిగా పడి ఉన్న ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. మెడలో దండ వేసి, అతనే తన భర్త అని ప్రకటించింది. అంతేకాదు, తనను కన్న తండ్రి, తోడబుట్టిన సోదరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ, తాను తన భర్త ఇంటికే వెళ్తానని, అక్కడే అత్తమామలతో ఉంటానని శపథం చేసింది.
ఈ ఘటన కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదు, మన సమాజం ఇంకా ఎంత వెనుకబడి ఉందో చెప్పే ఒక హెచ్చరిక. “పరువు హత్య” (Honor Killing) అనే పదం వినడానికి ఎంత సభ్యంగా ఉన్నా, అది చేసే పని మాత్రం అత్యంత అనాగరికం. మనుషులు పుట్టకముందు లేని కులం, చచ్చాక వెంట రాని కులం, బతికున్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత బలంగా మారుతోంది? కన్నబిడ్డ సంతోషం కంటే, ‘కుల గౌరవం’ ఎందుకు ఎక్కువైపోతోంది? ఆంచల్ తండ్రి, సోదరులు ఆ యువకుడిని చంపడం ద్వారా తాము గెలిచామని, తమ పరువు నిలబడిందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారు శాశ్వతంగా ఓడిపోయారు. ఒక నిండు ప్రాణాన్ని తీసిన హంతకులుగా, సొంత కూతురు జీవితాన్ని అంధకారం చేసిన కసాయివారిగా మిగిలిపోయారు.
మనం స్మార్ట్ ఫోన్లలో ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ పక్కనున్న మనిషిలో మానవత్వాన్ని చూడలేకపోతున్నాం. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీనికి కారణం చట్టం మీద భయం లేకపోవడం కంటే, కులం మీద ఉన్న వెర్రి అభిమానం ఎక్కువగా ఉండటమే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం కేవలం సానుభూతి చూపి వదిలేస్తున్నాం. కానీ, ఆంచల్ లాంటి అమ్మాయిలు చూపిస్తున్న తెగువ సమాజానికి ఒక పాఠం. తప్పు చేసింది సొంతవారైనా సరే, శిక్ష పడాల్సిందే అని ఆమె తీసుకున్న నిర్ణయం.. పరువు హత్యలను సమర్థించే వారికి చెంపపెట్టు.
నాందేడ్ ఘటనలో ఆంచల్ తీసుకున్న నిర్ణయం ఒక సాహసం. మృతదేహాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె “శారీరకమైన ఉనికి కంటే, మానసికమైన బంధం గొప్పది” అని చాటిచెప్పింది. తన తండ్రి, సోదరులను శిక్షించాలని కోరడం ద్వారా “రక్తం పంచుకు పుట్టిన బంధం కంటే, న్యాయం, ధర్మం గొప్పవి” అని నిరూపించింది.
చివరగా.. ప్రేమ గెలుస్తుంది, కానీ మనుషులు ఓడిపోతున్నారు. కులాలు, మతాల పేరుతో గీసుకున్న గీతలను చెరిపేయలేక, ఆ గీతల మధ్యే సమాధులను కట్టుకుంటున్నారు. ఇప్పటికైనా సమాజం మేల్కొనాలి. ప్రేమను ప్రేమగా చూడగలిగే కళ్లు లేనప్పుడు, కనీసం మనుషులుగా బ్రతికే గుండె అయినా ఉండాలి. లేదంటే, మనం సాధించిన అభివృద్ధి అంతా అబద్ధమే అవుతుంది.






