Bangladesh: తస్లీమా ప్రశ్నలకు బంగ్లా సర్కార్ దగ్గర ఆన్సరుందా..?
నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించి, కడిగి పారేసే వివాదాస్పద, ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్.. ఈసారి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తన కలాన్ని ఝలిపించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కు మరణశిక్ష విధించడంపై తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. హసీనాను నేరస్థురాలిగా పరిగణిస్తున్నప్పుడు, ప్రస్తుత ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్, ఆయన ‘జిహాదీ శక్తులను’ ఎందుకు వదిలేశారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గతేడాది జరిగిన విద్యార్థి ఉద్యమంలో హింసను ప్రేరేపించడం, నిరసనకారులను చంపాలని ఆదేశించడం వంటి మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) సోమవారం షేక్ హసీనాకు మరణశిక్షను విధించింది. ఇదే కేసులో మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా మరణశిక్ష పడగా, అప్రూవర్‌గా మారిన మాజీ ఐజీపీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు.
ఈ తీర్పుపై స్పందిస్తూ తస్లీమా “విధ్వంసానికి పాల్పడిన వారిపై కాల్పులు జరపమని గత జులైలో ఆదేశించినందుకు హసీనాను నేరస్థురాలిగా చూస్తే, ఇప్పుడు అదే పని చేస్తున్న యూనుస్ ప్రభుత్వం తనను తాను ఎందుకు నేరస్థులుగా పిలుచుకోవడం లేదు? బంగ్లాదేశ్‌లో న్యాయం పేరుతో ఈ ప్రహసనం ఎప్పుడు ముగుస్తుంది?” అని విమర్శించారు.
గతేడాది ఆగస్టు 5న జరిగిన భారీ ప్రజా ఉద్యమంతో 15 ఏళ్ల హసీనా పాలన అంతమైంది. ఆమె దేశం విడిచి ఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఈ తీర్పు పక్షపాతంతో, రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిందని హసీనా ఆరోపించారు. అయితే, చట్టానికి ఎవరూ అతీతులు కారని మహమ్మద్ యూనుస్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల ముందు వెలువడిన ఈ తీర్పు, బంగ్లా రాజకీయాల్లో మరింత అశాంతికి దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.






