Maharashtra : మహారాష్ట్రలో ఏం జరుగుతోంది..? ఎందుకింత ఆలస్యం..?

మహారాష్ట్రలో మహాయుతి (Mahayuthi) కూటమి ఘన విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీట్లు సంపాదించింది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నవంబర్ 26న ప్రభుత్వ గడువు కూడా ముగిసింది. అయితే ఇంతవరకూ కొత్త ప్రభుత్వం కొలువుతీరలేదు. మరింత ఆలస్యమవుతుందనే సమాచారం అందుతోంది. బీజేపీ (BJP), శివసేన (Shivsena), ఎన్సీపీ (NCP) మధ్య విభేదాల వల్లే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వల్లే బీజేపీ ముందడుగు వేయలేకపోతోందని సమాచారం. మరోవైపు ఆయన అనారోగ్యం కూడా ఆలస్యానికి కారణమనే వాదన కూడా వినిపిస్తోంది.
నవంబర్ 23న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి 132 సీట్లు రాగా., శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) కూటమికి పరాజయమే మిగిలింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు 20 సీట్లు రాగా కాంగ్రెస్ కు 16, శరద్ పవార్ ఎన్సీపీకి 10 సీట్లు మాత్రమే లభించాయి. దీంతో బీజేపీ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు. బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది కాబట్టి కచ్చితంగా ఆ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. వచ్చిన సీట్ల ఆధారంగా మంత్రి పదవులు పంచుకుంటారనే టాక్ వినిపించింది.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis), ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ (Ajith Pawar) ఢిల్లీ వెళ్లి అమిత్ షా (Amit Shah), నడ్డా (JP Nadda) లతో సమావేశమై చర్చించారు. అయితే అక్కడ ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని తెలిసింది. తనకు సీఎం పదవి ఇవ్వాలని ఏక్‌నాథ్ షిండే కోరినట్లు సమాచారం. అయితే ఇందుకు బీజేపీ ససేమిరా అనింది. దీంతో అలక వహించిన షిండే ముంబై వచ్చి వెంటనే తన సొంతూరికి వెళ్లిపోయారు. అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ముంబై వచ్చినా ఎవర్నీ కలవలేదు. అయితే ఏ నిర్ణయమైనా ఉమ్మడిగానే తీసుకుంటామని చెప్పారు. దీంతో బీజేపీ మాటకు షిండే కట్టుబడి ఉంటారని అనుకుంటున్నారు.
ఏకనాథ్ షిండే మరాఠా నేత. మరాఠాను కాదని మరో వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలంటే కచ్చితంగా దానికి షిండే ఆమోదం తప్పనిసరి. అందుకే షిండే సమ్మతికోసం బీజేపీ వేచి చూస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి చేయడం దాదాఫు ఖాయం. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారు. షిండే మాత్రం ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తే దానికి తన కుమారుడు శ్రీకాంత్ షిండే పేరును ఏకనాథ్ షిండే ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. శ్రీకాంత్ షిండే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఏకనాథ్ షిండే ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోకి ఏకనాథ్ షిండేని తీసుకోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఐదో తేదీన ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఇందులో భాగంగా మహారాష్ట్రా సీఎం ఎంపికకోసం బీజేపీ పరిశీలకులను నియమించింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఒకటి, రెండ్రోజుల్లోగా కూటమి నేతలతో చర్చించి ముఖ్యమంత్రి పదవిపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.