స్టడీ డెత్ సెంటర్స్..?

సెంట్రల్ దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి మెట్ల మీదుగా బయటకు వచ్చారు.అయితే ముగ్గురు విద్యార్థులు మాత్రం బయటకు రాలేక నీటిలో చిక్కుకుని మృతి చెందారు.దీంతో చట్ట విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్టడీ సెంటర్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే ఢిల్లీగా పేరుగాంచింది. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఢిల్లీ వచ్చి ప్రిపరేషన్ అవుతున్నారు.
అయితే..ఎప్పుడైతే విద్యార్థుల రాక అధికమైందో..దీన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు వ్యాపారంలా మార్చేశారు. పాత బిల్డింగ్ లు తీసుకుని .. తక్కువ అద్దెతో కోచింగ్ సెంటర్లు పెట్టేస్తున్నారు. ఇందులోనూ మరీ అధ్వాన్నంగా పార్కింగ్ కు వాడే సెల్లార్లను కూడా లైబ్రరీలుగా వాడేస్తున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగింది కూడా సెల్లార్ లోనే కావడం గమనార్హం. కోచింగ్ స్టాఫ్ పై పెడుతున్న శ్రద్ధ క్యాంపస్ లో వసతులపై పెట్టడం లేదు నిర్వాహకులు. గొర్రెల మందల్ని తోలినట్లుగా .. విద్యార్థులను సెంటర్లలోకి తోలేస్తున్నారు.
కోచింగ్ పూర్తయితే చాలు. సివిల్స్ రాసి, జాబ్ కొడదామని సంవత్సరాల తరబడి అక్కడే ఉంటున్నారు విద్యార్థులు. దీంతో కోచింగ్ సెంటర్ల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అయితే ఈ ప్రమాదం జరిగిన దగ్గర పరిస్థితులు బాగోలేదని.. అక్కడి మున్సిపల్ అధికారులకు పదిరోజుల క్రితం విద్యార్థులు, ఇతరులు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. కానీ.. దీని సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఆవిద్యాలయంలోని సెల్లార్ లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. అంతా అయిపోయింది.
ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. ఢిల్లీ సర్కార్ పై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా.. ఢిల్లీ లో అక్రమంగా నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు సీల్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.