Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు..!?
కాంగ్రెస్ పార్టీలో (Congress) అత్యంత కీలకమైన నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ, మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాలు, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములతో ఆయన నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీహార్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వంపై విస్తృత చర్చ జరుగుతోంది.
రాహుల్ గాంధీపై తరచుగా వినిపించే విమర్శల్లో ప్రధానమైనది – పార్ట్ టైమ్ పొలిటీషియన్. ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా కనిపించడం, ఆ తర్వాత సుదీర్ఘ విదేశీ పర్యటనలకు లేదా విరామాలకు వెళ్లడం రాహుల్ కు అలవాటు. ఇది పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతోంది. ఆయన కమిట్మెంట్ పై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం అనుకున్నంత వేగంగా, సమర్థవంతంగా జరగలేదు. జిల్లా, బ్లాక్ స్థాయిలలో పార్టీ నిర్మాణం బలహీనపడింది. ముఖ్యంగా, ప్రాంతీయంగా బలమైన నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో, వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శ ఉంది. ఇప్పటికీ కీలక నిర్ణయాల కోసం గాంధీ కుటుంబంపై ఆధారపడాల్సి వస్తోందనే ఆరోపణలున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీల హిందూత్వ, జాతీయవాద ఎజెండాకు ధీటుగా రాహుల్ గాంధీ ఒక బలమైన, ఆకర్షణీయమైన అజెండాను క్రియేట్ చేయడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారు. ఆయన ప్రసంగాల్లో అంబానీ, అదానీ, రఫేల్ వంటి అంశాలు ఉన్నప్పటికీ, అవి సాధారణ ప్రజలను కదిలించలేకపోతున్నాయి. దీంతో ఆయన చెప్పే అంశాలు సీరియస్ గా లేవనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రాహుల్ గాంధీ రోజూ సంస్కరణల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ తాను కూడా గాంధీ కుటుంబ వారసుడిననే విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. ఇది బీజేపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నా , తెర వెనుక ప్రభావితం చేస్తున్నారనే భావన పార్టీ సీనియర్లలో, ప్రజల్లోనూ ఉంది. పార్టీలోని సీనియర్ నాయకులను సమన్వయం చేయడంలో, యువ నాయకులను ప్రోత్సహించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. సీనియర్ల అనుభవాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం, ముఖ్యంగా సంక్షోభ సమయంలో వారి సలహాలను విస్మరించడం విమర్శలకు తావిచ్చింది.
కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికార దిశగా నడిపించాలంటే, రాహుల్ గాంధీ తన వ్యూహంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, ఆయన తన నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు లేని సమయంలో కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి. క్షేత్రస్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ‘భారత్ జోడో యాత్ర’ వంటివి మంచి ప్రయత్నం, కానీ అవి నిరంతరం కొనసాగాలి. పాత తరం నేతలను గౌరవిస్తూనే, కొత్తవారిని ప్రోత్సహించాలి. ఉత్సాహవంతులైన నాయకులకు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించాలి. స్థానిక నాయకత్వానికి, ముఖ్యమంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.
కేవలం జాతీయ స్థాయి విమర్శలకే పరిమితం కాకుండా, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న స్థానిక సమస్యలను ప్రధాన ఎజెండాగా మార్చాలి. రాష్ట్రాల సంస్కృతి, రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవాలి. బీజేపీ జాతీయవాదానికి ధీటుగా పేదరికం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, దళితులు-మైనార్టీల భద్రత వంటి అంశాలపై ఒక స్పష్టమైన ఆర్థిక-సామాజిక ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలి. ఇది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పక్షాలతో నమ్మకాన్ని పెంచుకోవాలి. పెద్ద పార్టీగా కాకుండా, సమష్టి నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ, మిత్రపక్షాల ఆందోళనలను పరిష్కరించాలి.
రాహుల్ గాంధీలోని నిష్కలంక వైఖరి అందరికీ నచ్చుతుంది. అయితే రాజకీయాల్లో దూకుడు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కేవలం వంశపారంపర్య నాయకత్వంపై ఆధారపడకుండా, పార్టీని నిలకడగా నడిపించగలిగే శక్తిని రాహుల్ గాంధీ అలవర్చుకోవాలి. ఆయన తన శైలిని, వ్యూహాలను మార్చుకోగలిగితేనే, కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించగలుగుతుంది, లేదంటే ‘ఫెయిల్యూర్ పొలిటీషియన్’ అనే ముద్ర చెరిగిపోవడం కష్టమే.






