దేశాన్ని కుదిపేసిన వయనాడ్ విషాదం ..!

కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య డబుల్ సెంచరీ దిశగా సాగుతోంది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.
కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని సమాచారం. సోమవారం అర్ధరాత్రి సమయంలో గ్రామస్థులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్థులు ఆ మట్టిలోనే కలిసిపోయారు.
తొలుత మండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంత మంది బాధితులను సమీపంలోని చూరాల్‌మలలోని వెల్లారిమల పాఠశాలవద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంసహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చూరాల్‌మల గ్రామంలోని కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది. మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.