Voruganti Srinivas: రాజస్థాన్ సీఎస్ గా తెలుగు ఐఏఎస్ ఓరుగంటి శ్రీనివాస్..!
రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా తెలుగు ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ (Voruganti Srinivas) నియమితులయ్యారు. 1989 రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణల విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను, రాజస్థాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం తిరిగి సొంత క్యాడర్‌కు పంపింది. ఢిల్లీ నుంచి రిలీవ్ అయిన మరుసటి రోజే ఆయనకు సీఎస్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు.2026 సెప్టెంబరు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఓరుగంటి శ్రీనివాస్‌కు తెలుగు రాష్ట్రాలతో విడదీయరాని బంధం ఉంది. ఆయన 1966 సెప్టెంబరు 1న అరకు లోయలో జన్మించారు. ఆయన తండ్రి జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్గా పనిచేసేవారు. అరకు, తెలంగాణలోని దుమ్ముగూడెంలో పెరిగిన శ్రీనివాస్, భద్రాచలం పంచాయతీ స్కూల్లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తిచేశాక ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన ప్రశంసలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. “90వ దశకం నుంచి మీరు స్మార్ట్ గవర్నెన్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యం కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చింది. నేను అండర్ సెక్రటరీగా చేరినప్పుడు మీరు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు 37 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న తరుణంలోనూ మీరే సీఎంగా ఉన్నారు. దేశానికి మీరు చేసిన సేవలకు మా సెల్యూట్ స్వీకరించండి” అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
శ్రీనివాస్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కూడా. ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని వివాహం చేసుకున్నారు. అరకు గిరిజనులతో తనకున్న జ్ఞాపకాలను ‘టువర్డ్స్ ఏ న్యూ ఇండియా’ పుస్తకంలో ఆయన ప్రస్తావించారు.






