Mumbai: ద్వైపాక్షిక బంధ బలోపేతమే లక్ష్యం.. మోడీ-స్టార్మర్ కీలక ఒప్పందాలు..

భారత్- బ్రిటన్ (India-Britain) ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇంగ్లాండ్ ప్రధాని కీవ్ స్టార్మర్ .. ఇండియా పర్యటన సాగింది. ప్రపంచ సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి మూలస్తంభంలా ఇరుదేశాల మధ్య సంబంధాలు నిలుస్తాయన్నారు భారత ప్రధాని మోడీ. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్‌తో గురువారం ముంబయిలో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ప్రతినిధి బృందాల స్థాయిలో చర్చలు జరిగాయి. రక్షణరంగ సహకారం, బ్రిటన్ విద్యాసంస్థల ప్రాంగణాలు మనదేశంలో ఏర్పాటు చేసుకోవడం సహా పలు ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
వాణిజ్యం, రక్షణ, సాంకేతికత రంగాల్లో సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. విలువైన ఖనిజాలు, కృత్రిమ మేధ, టెలికాం, ఆరోగ్యం, విద్యారంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోనున్నాయి. పహల్గాం దాడి సహా ఉగ్రవాద పోకడల్ని ఇద్దరు ప్రధానులు ఖండించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధంపైనా వారు చర్చించారు. రష్యా నుంచి ముడిచమురు కొనడాన్ని ఆపేయాలని భారత్‌ను కోరారా అని స్టార్మర్‌ను విలేకరులు ప్రశ్నించగా- ఉక్రెయిన్ ఘర్షణ ముగింపు మార్గాలపై స్థూలంగా చర్చించామని బదులిచ్చారు. బ్రిటన్‌కు చెందిన తొమ్మిది విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లను వచ్చే ఏడాది ప్రారంభిస్తాయని మోడీ ప్రకటించారు.
‘భారత్-బ్రిటన్‌లు సహజ భాగస్వాములు. ప్రజాస్వామ్య విలువలు, స్వాతంత్య్రం, చట్టబద్ధ పాలనలపై మన సంబంధాలు నిర్మితమయ్యాయి. భారత్ క్రియాశీలత, బ్రిటన్ అనుభవం కలిసి మన దేశాల బంధాలను భిన్నరంగాలకు మరింతగా విస్తరించడానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మనది నమ్మదగ్గ భాగస్వామ్యం. ప్రతిభ, సాంకేతికతల ద్వారా ఇరు దేశాలకూ ఉజ్వల భవితను నిర్మించడానికి ఇరువురం కట్టుబడి ఉన్నాం’ అని మోడీ చెప్పారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక పరిణామం: స్టార్మర్
రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఒక కీలక పరిణామమని స్టార్మర్ పేర్కొన్నారు. టారిఫ్‌లను తగ్గించి, ఒకరి మార్కెట్లోకి ఒకరు ప్రవేశించేందుకు, ఉద్యోగాల సృష్టికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి భారత్‌ను తీసుకువెళ్తున్నందుకు మోడీని అభినందిస్తున్నానన్నారు. అధునాతన భాగస్వామ్యాన్ని సృష్టించి, అవకాశాలు కల్పించడంపై ఇరువురం దృష్టి సారించామని, భారత్ వృద్ధిగాథ చిరస్మరణీయమని పేర్కొన్నారు. వికసిత భారత్ దార్శనికతలో తామూ భాగం పంచుకుంటామన్నారు. భారత్‌లో తమ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల ఏర్పాటు వల్ల విద్యార్థులకే కాకుండా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. కృత్రిమ మేధ, అధునాతన కమ్యూనికేషన్లు, రక్షణరంగ సాంకేతికతల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని చెప్పారు.