AP vs Karnataka: పెట్టుబడుల కోసం ట్వీట్ల యుద్ధం.. ఆఖరి పంచ్ లోకేశ్‌దే..!!

పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇరు రాష్ట్రాల మంత్రులు చేస్తున్న ట్వీట్లు ఈ పోటీని మరింత ఆసక్తికరంగా, కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుస్తున్నాయి. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh).. కర్నాటకలోని (Karnataka) కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు (AP) ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కర్నాటక మంత్రులు ఇస్తున్న ఘాటు సమాధానాలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
పెట్టుబడుల విషయంలో నారా లోకేశ్ చురుకైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కర్నాటక రాష్ట్రం స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినప్పుడు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ ట్వీట్ చేశారు. బెంగళూరులోని (Bengaluru) మౌలిక వసతుల సమస్యల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా లోకేశ్ ముందుంటున్నారు. ముఖ్యంగా వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలు, ట్రాఫిక్‌పై ఐటీ కంపెనీల సీఈవోలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడల్లా, లోకేశ్ వెంటనే రంగంలోకి దిగుతున్నారు. తాజాగా బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని సమస్యల కారణంగా పలు కంపెనీలు నగరంలోని ఉత్తర ప్రాంతాలకు తరలివెళ్లాలని చూస్తున్న వార్తలపై లోకేశ్ స్పందించారు. “నార్త్ బాగుంది. అయితే, ఇంకాస్త ఉత్తరాన ఉన్న అనంతపురంలో మేము ప్రపంచస్థాయి ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నాం!” అంటూ ట్వీట్ చేశారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న అనంతపురంతో పాటు వరల్డ్ క్లాస్ సిటీ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం లోకేశ్ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో మిట్టల్ స్టీల్ ప్రాజెక్టు, ఏరోస్పేస్ పార్క్ కోసం కేటాయించిన భూమి అంశాలలో కూడా ఆయన ఏపీని ప్రమోట్ చేశారు.
లోకేశ్ ట్వీట్లపై కర్నాటక మంత్రులు గట్టిగా స్పందించారు. కర్నాటక ఐటీ, బీటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge), లోకేశ్ చేసిన ట్వీట్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పెట్టుబడుల కోసం ఏపీ ప్రయత్నించడాన్ని ఆయన ఒక బలహీనమైన పర్యావరణ వ్యవస్థగా అభివర్ణించారు. బలమైన వ్యవస్థల నుండి లబ్ది పొందేందుకు బలహీనమైన పర్యావరణ వ్యవస్థలు ప్రయత్నించడం సహజమేనన్నారు. అయితే ఇది నిస్సహాయమైన ఆకలిగా మారినప్పుడు అది బలహీనతనే చూపిస్తుందని ఖర్గే విమర్శించారు. బెంగళూరు జీడీపీ 2035 నాటికి 8.5% వృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలుస్తుందని ఖర్గే అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కర్నాటక ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. ఈ వివాదంలో, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా జోక్యం చేసుకున్నారు. బెంగళూరులోని మౌలిక సదుపాయాల గురించి ఫిర్యాదు చేస్తున్న కొంతమందిని ఉద్దేశించి, ప్రభుత్వం బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లను పట్టించుకోదని స్పష్టం చేశారు.
కర్నాటక మంత్రుల వ్యాఖ్యలకు లోకేశ్ మరింత సెటైరికల్‌గా, వ్యూహాత్మకంగా కౌంటర్ ఇచ్చి ఈ వివాదానికి మరింత అగ్గి రాజేశారు. ప్రత్యేకించి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలకు స్పందిస్తూ.. “భారతదేశంలో అతి పిన్న రాష్ట్రంగా, మేము వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ప్రతి అవకాశాన్ని వెతుకుతున్నాం. రాష్ట్రాలు పెట్టుబడులు, ఉద్యోగాల కోసం పోటీపడితే, భారత్ వృద్ధి చెందుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు. ఖర్గే చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ… “నా వినయపూర్వకమైన సూచన: అహంకారం, రోడ్లపై ఉన్న గుంతల లాంటిది, ప్రయాణం ఆగిపోకముందే దాన్ని సరిదిద్దాలి!” అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేసి కర్నాటకలోని రోడ్ల సమస్యను ఎత్తిచూపారు. ఈ ట్వీట్ ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచింది.
ఈ ట్వీట్ల యుద్ధం ఇరు రాష్ట్రాల మధ్య పెరుగుతున్న ఆర్థిక పోటీకి అద్దం పడుతోంది. కర్నాటక ప్రధానంగా బెంగళూరు బలమైన ఇకోసిస్టమ్‌పై ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కావడంతో మెరుగైన మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో దూకుడుగా ముందుకు సాగుతోంది. బెంగళూరుకు దగ్గరగా ఉన్న రాయలసీమ ప్రాంతం, విశాఖపట్నం వంటి నగరాలను పెట్టుబడులకు కొత్త కేంద్రాలుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాల మధ్య ఈ పోటీ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, మంత్రులు వ్యక్తిగత విమర్శలకు, కించపరిచే వ్యాఖ్యలకు దిగడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ పోటీ భవిష్యత్తులో దేశంలో పెట్టుబడులను ఆకర్షించడంలో మరింత కీలకమైన పరిణామాలకు దారితీయడం ఖాయం. లోకేశ్ చొరవ, కర్నాటక మంత్రుల కౌంటర్‌తో ఏపీ, కర్నాటకల మధ్య పెట్టుబడుల యుద్ధం మరింత రసవత్తరంగా మారింది.