GAZA: గాజా స్వాధినం చేసుకుంటామంటున్న అమెరికా.. ట్రంప్ ప్రతిపాదనకు గల్ఫ్ (Gulf)దేశాల అభ్యంతరం
అమెరికా అధ్యక్షుడు పాలనలో దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అంటూ ఎన్నికల్లో ఓట్లేయించుకున్న ట్రంప్…ఇప్పుడు ఒకొక్కటిగా తన నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. గాజా సమస్యకు పరిష్కారం చూపిస్తానంటూ ఎన్నికల ముందు ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తామంటున్నారు. అయితే ఈప్రతిపాదనకు గల్ఫ్ ప్రపంచం నుంచి అభ్యంతరం వ్యక్తమవతోంది. మరీ ముఖ్యంగా పాలస్తీనా అయితే.. చావనైనా చస్తాం కానీ.. ఈప్రతిపాదనకు తాము అంగీకరించమంటోంది.
లక్షల సంఖ్యలో పాలస్తీనావాసులను గాజాస్ట్రిప్ నుంచి వేరేచోటకు బలవంతంగానైనా పంపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేస్తున్న ప్రయత్నం కార్యరూపం దాల్చడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ట్రంప్ యోచన ఒక జాతిని మొత్తం నిర్మూలించే ప్రయత్నంగా పాలస్తీనీయులు(palestine) భావిస్తున్నారు. తమకంటూ ఒక దేశం ఉండాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్త విస్తృత మద్దతు లభిస్తున్న తరుణంలో దానిని నీరుగార్చేందుకు ఇదొక ప్రయత్నమని వారు ఆరోపిస్తున్నారు.. శిథిల నగరంలో మట్టిని తినైనా ఇక్కడే బతుకుతాం తప్ప గాజాను వీడేది లేదని కుండబద్దలు కొడుతున్నారు.
ఇజ్రాయెల్‌తో శాంతి చర్చల విషయంలో అమెరికాకు మిత్రపక్షాలుగా ఉన్న ఈజిప్టు, జోర్డాన్ సహా అరబ్ దేశాలన్నీ ట్రంప్ ప్రణాళికను తప్పుపడుతున్నాయి. పాలస్తీనా శరణార్థుల్ని తాము మరింతగా తీసుకోవాలన్న సూచనను విమర్శిస్తున్నాయి. గాజాతో కూడిన పాలస్తీనాను ఒక దేశంగా ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణస్థాయికి చేరుకోబోవని సౌదీ(saudi) అరేబియా పేర్కొంది. స్పష్టం చేసింది. గాజాలో కాల్పుల విరమణకు, హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి విడుదలకు ఈ ప్రతిపాదన అడ్డంకిగా నిలుస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గాజా తమ అంతర్భాగమని పాలస్తీనీయుల అభిప్రాయం. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ హస్తగతం చేసుకున్న తూర్పు జెరూసలెం, వెస్ట్‌బ్యాంక్, గాజాలతో కలిపి స్వతంత్ర దేశంగా ఉండాలనేది పాలస్తీనా భావన. 1948 యుద్ధంలో శరణార్థులుగా మిగిలినవారి వారసులే ఇప్పుడు గాజా జనాభాలో ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత ఇజ్రాయెల్ నుంచి వేల సంఖ్యలో పాలస్తీనీయులు అప్పుడు వలసవెళ్లారు. యూదుల కంటే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వారు మళ్లీ వెనక్కి వచ్చేందుకు అనుమతి లభించలేదు.
పునరావాసానికి ససేమిరా
పాలస్తీనా వారికి తమ సరిహద్దుల్లో పునరాశ్రయం కల్పించాలనే ప్రతిపాదనలను ఈజిప్టు, జోర్డాన్ పలుమార్లు తిరస్కరించాయి. వారు తిరిగి వచ్చేందుకు ఇజ్రాయెల్ ఎప్పటికీ అనుమతించదని అవి భయపడుతున్నాయి. శరణార్థులు భారీగా వచ్చిపడితే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తవచ్చని కూడా అవి ఆందోళన చెందుతున్నాయి. ఆర్థికంగానూ అది భారమని భావిస్తున్నాయి. పాలస్తీనీయుల పునరావాసానికి సంపన్న దేశాలు సాయం చేయాలని ట్రంప్ చేసిన సూచనకు స్పందన కరవయింది. ఇలాంటి నిధులిచ్చే ప్రసక్తే లేదని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఈజిప్టు, జోర్డాన్ తెగేసి చెప్పాయి. ఇజ్రాయెల్ మాత్రం ట్రంప్ ప్రతిపాదనను ఆహ్వానించింది.






