US: పుతిన్ డిమాండ్లకు ఓకె.. జెలెన్ స్కీకి ట్రంప్ షాక్..?
పుతిన్ డీల్ అంత ఈజీ కాదన్న సంగతి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అర్థమైందా..? మిగిలిన దేశాలతో ఆడినట్లు ఆటలాడితే.. పుతిన్ లొంగరని నిర్ధారణకు వచ్చిన ట్రంప్.. ఇప్పుడు అటువైపు నుంచి నరుక్కు వస్తున్నారు. పుతిన్ డిమాండ్లకు మద్దతు పలుకుతూ.. జెలెన్ స్కీకి షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
మూడేళ్లకు పైగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్స్కీ ప్రభుత్వానికి అందించారు. దీనిపై ట్రంప్ (Donald Trump) ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ జాతీయ భద్రతాధిపతి రుస్తుమ్ ఉమరోవ్ మధ్య సమావేశం జరిగింది. ఈ ప్రణాళికకు అంగీకారం తెలపాలని అమెరికా కోరుకుంటుందని ఆ సందర్భంగా విట్కాఫ్ స్పష్టం చేశారు. కానీ పలు నిబంధనలను జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నారు. వాటిని అంగీకరించడం అంటే తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవడమేనని కీవ్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. మిత్ర దేశం నిరాకరిస్తున్నా.. ట్రంప్ మాత్రం దానికి మద్దతు తెలిపినట్లు సమాచారం.
ఆ ప్లాన్ ప్రకారం.. ఉక్రెయిన్ తూర్పు డాన్‌బాస్‌లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యా (Russia)కు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఎవరూ అందించకూడదు.
స్వదేశంలో వెలుగుచూస్తోన్న అవినీతి కుంభకోణాల్లో తన సన్నిహితుల పేర్లు ఉండటంతో జెలెన్స్కీ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన సహాయకుల్లో పలువురిని వారి పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. ఈ రాజకీయ అస్థిరతలను వాషింగ్టన్ ఒక అవకాశంగా చూస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్లాన్‌ను ప్రతిపాదించడం గమనార్హం.






