Whitehouse: ట్రంప్ అండ్ మస్క్.. టామ్ అండ్ జెర్రీ గేమ్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలే ట్రంప్ కలల బిల్లు ‘బిగ్ బ్యూటిఫుల్’ (Big Beautiful Bill)పై సెనెట్ లో చర్చ సందర్బంగా .. ఈ బిల్లుకు మద్దతిస్తే తప్పకుండా ఆ ఎంపీలను ఓడిస్తామని మస్క్ హెచ్చరికలు సైతం చేశారు. ప్రభుత్వ వ్యయాలు తగ్గిస్తామని చెప్పి.. ఇప్పుడు ఓటు వేస్తే తలవంచుకొని సిగ్గు పడాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే.. దీనిపై ట్రంప్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో మస్క్‌ను దేశం నుంచి బహిష్కరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో మస్క్ (Elon Musk) వెనక్కి తగ్గారు. విభేదాల నేపథ్యంలో మస్క్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారా? అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. తాను దాన్ని పరిశీలిస్తున్నానని తెలిపారు. ఈ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మస్క్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ట్రంప్ విలేకరులతో మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘దీన్ని మరింత పెద్దది చేయాలని ఉత్సాహంగా ఉంది. చాలా చాలా ఉత్సాహంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఏమీ చేయదల్చుకోలేదు’ అంటూ మస్క్ పేర్కొన్నారు.
ట్రంప్ కలల బిల్లు ‘బిగ్ బ్యూటిఫుల్’ (Big Beautiful Bill)ను మస్క్ మొదటినుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇటీవల సెనెట్‌లో కూడా ఆమోదం పొందింది. దీనిపై మరోసారి సెనెట్‌లో ఓటింగ్ జరగనుండగా మస్క్ వరుస పోస్టులతో విరుచుకుపడ్డారు. ఆ బిల్లుకు ఓటు వేసే కాంగ్రెస్ సభ్యుల సీట్లకు వచ్చే ఏడాది ఎసరు పెట్టేందుకు పని చేస్తానని హెచ్చరించారు.
దీనిపై ట్రంప్ కూడా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో ఏ వ్యక్తికి దక్కనన్ని సబ్సిడీలు మస్క్‌కు దక్కాయన్నారు. ఈ సబ్సిడీలు లేకపోతే ఆయన దుకాణం మూసేసుకుని దక్షిణాఫ్రికాకు (మస్క్ సొంత దేశం) వెళ్లిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్లు, విద్యుత్తు కార్ల ఉత్పత్తి లేకపోతే దేశానికి ఎంతో మిగులుతుందని, దీనిపై చర్యలు తీసుకోవడానికి డోజ్ ఉందన్నారు.