చైనా ఆర్మీ బలం ‘ఢాంబికమేనా..?’
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ ఆదేశం సొంతం. ఇక అధునాతన ఆయుధాలను మోహరిస్తూ ప్రత్యర్థి దేశాలను భయపెడుతూ రావడం వారి యుద్ధవ్యూహాల్లో ఒకటి. ఎప్పుడు పొరుగుదేశాల భూభాగాలు, సముద్రతీరజలాల్లో చొచ్చుకుపోవడం, వారి బలగాలను బెదిరించడం… చైనా చేస్తున్న నిర్వాకం. అయితే చైనా కనిపిస్తున్నంతబలంగా లేదని..మనకు డోక్లాం వ్యవహారం నేర్పింది.ఇప్పుడు ఆ విషయాన్ని .. చైనా సైనిక ప్రతినిధులు సైతం అంగీకరించిన సందర్భం చోటు చేసుకుంది.
సాదారణంగా ఏదేశమైన తన సైనికులకు యుద్ద విన్యాసాల్లో చక్కని శిక్షణ ఇస్తుంది. కానీ.. చైనా మాత్రం తమ సైనికులకు ఫేక్ యుద్ధ విన్యాసాలు చేయిస్తోంది. ఆమాట అంటుంది ఎవరో కాదు.. అత్యున్నత సైన్యాధికారి జనరల్ హే వైడాంగ్. పీఎల్ఏ ప్రతినిధి వర్గానికి .. ఇదే అంశంపై సూచనలు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలమైంది. ప్రపంచదేశాలు సైతం .. చైనా ఆర్మీ యుద్ధ సన్నద్ధతపై ఆలోచించేలా చేసింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేతృత్వంలో త్రివిధ దళాలను నియంత్రించే కేంద్రీయ సైనిక కమిషన్ (సీఎంసీ) ఉపాధ్యక్షుడు హే వైడాంగ్. రేపటి యుద్ధాల్లో గెలవడానికి సముద్ర పోరాటాల్లోనూ నిష్ణాతులు కావాలని జిన్‌పింగ్ ఆదేశించిన నేపథ్యంలో జనరల్ హే ఇలాంటి సూచన చేయడం సంచలనం రేపింది. చైనా సైన్యం వద్దనున్న ఆయుధ సామగ్రి నాణ్యతను కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రక్షణ దళాల ప్రక్షాళనకు జిన్‌పింగ్ పూనుకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
జిన్‌పింగ్ నిరుడు రక్షణ మంత్రిని బర్తరఫ్ చేశారు. చైనా క్షిపణి దళమైన రాకెట్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సహా మొత్తం 9 మంది సీనియర్ సేనానులకు ఉద్వాసన పలికారు. తైవాన్‌తో సంఘర్షణ వాతావరణం ముదురుతున్న నేపథ్యంలో చైనా తన సైనిక దళాల ఆధునికీకరణను ముమ్మరం చేస్తోంది. ఇటీవల తన రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతం మేర పెంచింది.






