Chandrababu: డిసెంబర్ లోపు జిల్లాల పునర్విభజన పూర్తికి ప్రణాళిక సిద్ధం చేస్తున్న కూటమి ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హయాంలో ప్రజల అభీష్టాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే, హిందూపురం (Hindupur) శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రజల తరఫున చేసిన విజ్ఞప్తికి స్పందనగా హిందూపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందనే సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే ఉన్న హిందూపురం నియోజకవర్గంతో పాటు కదిరి (Kadiri), ధర్మవరం (Dharmavaram), పెనుకొండ (Penukonda), పుట్టపర్తి (Puttaparthi), మడకశిర (Madakasira-SC) నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచనలో ఉందట. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలున్నా, ఇవి పూర్తిగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏర్పడలేదన్న విమర్శలు గతంలో వెలువడ్డాయి. అయితే ఇప్పుడు అధికార వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాన్ని 32 జిల్లాలుగా విస్తరించే దిశగా పునర్వ్యవస్థీకరణపై ప్రక్రియ మొదలైంది. దీనిపై ఆగస్టు రెండవ వారంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కేవలం 13 జిల్లాలే ఉండగా, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో పార్లమెంటరీ నియోజకవర్గాలను ఆధారంగా చేసుకుని 25 జిల్లాలుగా విస్తరించాలనే ప్రణాళిక రూపొందించారు. అయితే అరకు (Araku) వంటి విస్తృత ప్రాంతాలు ఉండటంతో అదనంగా ఓ జిల్లా ఏర్పడటంతో మొత్తం 26 జిల్లాలుగా మారాయి. అయితే ఈ జిల్లాల పేర్లు, పరిమితుల విషయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి. ప్రత్యేకించి కోనసీమ (Konaseema), హిందూపురం, రాజంపేట (Rajampet) వంటి ప్రాంతాల్లో తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు జిల్లా, మండలాల పునర్విభజన డిసెంబరు 31 వరకు ముగించాలని సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టింది. డిసెంబరు నాటికి మార్పులు పూర్తయితే, వచ్చే జనవరి నుంచి కొత్త జిల్లాల ప్రకారం గణాంకాలు సేకరించేందుకు వీలవుతుంది.ఈసారి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశపడుతున్నారు. 2028 వరకు మార్పులు చేయలేని పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలే కీలకంగా మారబోతున్నాయి.