Digital Book: రెడ్‌బుక్‌కు పోటీగా వైసీపీ డిజిటల్ బుక్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయం బుక్‌ల చుట్టూ తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని వైసీపీ (YCP) ఆరోపిస్తోంది. భారత రాజ్యాంగం ఏపీలో అమలు కావట్లేదని, లోకేశ్ (Nara Lokesh) నేతృత్వంలో రెడ్ బుక్ అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ రెడ్ బుక్ కు ప్రతీకారంగా వైసీపీ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టింది. వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ దీన్ని అధికారికంగా ఇవాళ ప్రారంభించారు. కూటమి పాలనలో ఇబ్బందులు పడుతున్న వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఈ డిజిటల్ బుక్ ను ప్రారంభించినట్లు జగన్ వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఇవాళ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పలు అంశాలను కేడర్ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, చంద్రబాబు జనాల్లోకి వెళ్లే పరిస్థితి లేదని వివరించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ తో ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ స్థాయిలో మోసం చేసేవాళ్లు ప్రపంచంలో ఎవరూ ఉండరని జగన్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ, యూరియా కొరత, ఫీజు రీఇంబర్స్ మెంట్ లాంటి అంశాలను ఆయన ఎత్తి చూపారు. ఎన్నికలు సాఫీగా జరిగితే చంద్రబాబు ఎప్పటికీ గెలవలేడని, అందుకే ఆయన అలా జరగకుండా అన్ని కుట్రలు చేస్తారని జగన్ అన్నారు. అందుకే కేడర్ మొత్తం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పోరాడాలని సూచించారు. డిసెంబర్ 15 నాటికి అన్ని కమిటీలూ పూర్తవుతాయని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఈసారి కేడర్ ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పారు.
రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు. కార్యకర్తలెవరైనా digitalbook.weysrcp.com లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే 040-49171718 నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రేపు మనం అధికారంలోకి రాగానే, బాధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టమన్నారు. ఈరోజు వారు రెడ్‌బుక్ అంటున్నారని, రేపు మనం డిజిటల్ బుక్ ఏమిటన్నది చూపిస్తామని జగన్ హెచ్చరించారు
2024 ఎన్నికలకు ముందు టీడీపీ యువనేత నారా లోకశ్, అప్పటి వైసీపీ ప్రభుత్వ అక్రమాలను రెడ్ బుక్ లో రాసుకుంటున్నట్టు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే లోకేశ్ హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇదంతా రెడ్ బుక్ వల్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే తాము కూడా డిజిటల్ బుక్ తీసుకొచ్చినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు.