NDSA Report: కాంగ్రెస్‌కు ఆయుధం.. బీఆర్ఎస్‌కు ఇరకాటం..!!

తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (KLIS)కి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన తాజా నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలను ఈ నివేదిక ఎత్తి చూపింది, దీంతో గత BRS ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను రాజకీయ ఆయుధంగా మలుచుకుంటోంది. BRS వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది.
భారతదేశంలోని అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కాళేశ్వరం (Kaleswaram) ఒకటి. ఇది గోదావరి (Godavari) నది నీటిని ఎత్తిపోసి మిలియన్ల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపొందింది. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కీలకం. 2016లో ప్రారంభమై, 2019 నాటికి పూర్తైన ఈ బ్యారేజీల నిర్మాణంలో అనేక లోపాలను NDSA గుర్తించింది. మేడిగడ్డ (Medigadda) బ్యారేజ్‌లోని బ్లాక్ 7 శాశ్వతంగా దెబ్బతినడంతో దాన్ని డీకమిషన్ చేయాలని లేదంటే స్థిరీకరణ చర్యలు చేపట్టాలని NDSA సిఫార్సు చేసింది. నివేదిక ప్రకారం.. సరైన నేల పరీక్షలు, భౌగోళిక సర్వేలు నిర్వహించకుండానే నిర్మాణం జరిగింది. బ్యారేజీల కింద కావిటీ ఫార్మేషన్ ఏర్పడినట్లు భౌగోళిక సర్వేలు వెల్లడించాయి. ఇది బ్యారేజ్ సేఫ్టీకి ముప్పు కలిగిస్తోంది. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజ్‌లో జరిగిన ప్రమాదం తర్వాత అప్పటి BRS ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు నివేదిక విమర్శించింది.
NDSA నివేదిక 2024 డిసెంబర్‌లో తయారైంది. తాజాగా ఈ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి అందింది. ఈ నివేదికను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) బయటపెట్టారు. “డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని NDSA స్పష్టం చేసింది. రూ.లక్ష కోట్లు అప్పు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు BRS పాలనలోనే విఫలమైంది” అని ఆయన ఆరోపించారు. BRS నాయకులు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు BRS నాయకులు ఈ నివేదికను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. దీన్ని “NDSA రిపోర్టు కాదు, NDA రిపోర్టు” అని పేర్కొన్నారు. దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. BRS రజతోత్సవ ఉత్సవాలకు ముందు ఈ నివేదిక విడుదలవడం వెనుక తమ పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర ఉందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధికారులతో చర్చించనున్నట్టు సమాచారం. మరోవైపు.. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత రెండు సీజన్లలో సాగునీటి కొరతతో రైతులు నష్టపోయారు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఏడాది కూడా నష్టపోతామని భయపడుతున్నారు.