Bangladesh: హసీనా మరణశిక్షపై రగిలిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్’ (ICT) మరణ శిక్ష విధించడంతో… బంగ్లాదేశ్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ.. హసీనా మద్దతుదారులు బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చేపట్టారు.ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఢాకా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ రెండు రోజులపాటు బంద్ ప్రకటిస్తున్నట్లు అవామీ లీగ్ ప్రకటించింది. దీంతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పోలీసులను మోహరించింది.
షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ఇల్లు ఉన్న ధన్మొండి 32 సహా పలు ప్రాంతాల్లో హసీనా మద్దతుదారులు రహదారులను దిగ్బంధించి, ఇతర నివాసాలు, దుకాణాల పైకి రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్‌ను ఉపయోగించాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మీడియాకు బంగ్లా సర్కార్ సూచనలు, హెచ్చరికలు..
పరారీలో ఉన్న షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు, ప్రకటనలకు సంబంధించిన విషయాలను ప్రచారం చేయొద్దని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్ మీడియా సంస్థలను హెచ్చరించింది. దేశంలో శాంతిభద్రతల దృష్ట్యా హింస, నేర కార్యకలాపాలను ప్రేరేపించే హసీనా వ్యాఖ్యలను ప్రసారం చేయొద్దని తెలిపింది. ఇవి సైబర్ భద్రతా ఆర్డినెన్స్ నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తాయని పేర్కొంది. అటువంటి వార్తలు ప్రసారం చేసేవారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామంది.
విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని పదవి వీడిన షేక్ హసీనా.. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్‌కు వచ్చారు. నాటినుంచి ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. స్వదేశంలో ఆందోళనల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆమెపై కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ఐసీటీ సోమవారం హసీనాను దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె ఖండించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినందుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది.






