Porn Ban: పోర్న్ నిషేధిస్తే నేపాల్ తరహా ఉద్యమం వస్తుందా?
ఆన్లైన్ అశ్లీల కంటెంట్‌ను (Pornographic Content) దేశవ్యాప్తంగా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “ఇలా సోషల్ మీడియాపై నిషేధం విధిస్తే నేపాల్‌లో ఏం జరిగిందో చూశాం కదా” అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య, పోర్న్‌పై నిషేధం విధించే ఆలోచన లేదని పరోక్షంగా సూచిస్తోంది. అంతేకాక ప్రజల డిజిటల్ స్వేచ్ఛ, ప్రభుత్వ నియంత్రణ మధ్య ఉన్న సంక్లిష్టమైన సమస్యను ఎత్తి చూపింది. నిజంగానే పోర్న్‌ను నిషేధిస్తే నేపాల్ తరహా ఉద్యమం వచ్చే అవకాశం ఉందా? అనే అంశంపై చర్చకు దారితీసింది.
పోర్న్ నిషేధంపై చర్చ సందర్భంగా సుప్రీంకోర్టు నేపాల్ ఉద్యమాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అక్కడేం జరిగిందో తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో నేపాల్ లో సోషల్ మీడియా యాప్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగింది. అవినీతిని అరికట్టేందుకు, నిబంధనలను పాటించని కారణంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి 26 యాప్‌లపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం జనరేషన్-జెడ్ (Gen-Z) గా పిలవబడే యవతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సోషల్ మీడియా ద్వారానే మాట్లాడుకునే ఈ తరం, ఈ నిషేధాన్ని భావప్రకటన స్వేచ్ఛను హరించడంగా భావించింది. దీంతో రోడ్డెక్కి ప్రభుత్వాన్ని స్తంభింపజేసింది. చివరకు ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసి, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాల్సి వచ్చింది.
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం భావప్రకటన స్వేచ్ఛ, కమ్యూనికేషన్ హక్కులకు సంబంధించినది. కానీ, పోర్న్‌పై నిషేధం అనేది నైతికత, యువత భద్రత, చట్టబద్ధత అనే కోణాల్లో చూడాలి. అయితే, సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక వెనుక నిగూఢ అర్థం దాగి ఉంది. భారతదేశంలో డిజిటల్ విప్లవం తర్వాత, పోర్న్ కంటెంట్ ఒక క్లిక్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పోర్న్‌కు అలవాటు పడిన యువత సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆన్లైన్లో కోట్ల సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అలవాటును ఒక్కసారిగా నిషేధిస్తే, తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనేది కొందరి ఆలోచన. అంతేకాక, పోర్న్‌ను వీక్షించడం అనేది వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ కిందికి వస్తుంది. చట్టబద్ధమైన వయస్సు కలిగిన వ్యక్తులు ఏది చూడాలి, ఏది చూడకూడదు అని రైట్ ప్రభుత్వానికి ఉండదు. అలా చేస్తే వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. పోర్న్‌ను పూర్తిగా నిషేధించడం సాంకేతికంగా దాదాపు అసాధ్యం. VPNలు, కొత్త డొమైన్లు, అంతర్జాతీయ సర్వర్ల ద్వారా కంటెంట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
పోర్న్‌పై నిషేధం యువతను రక్షించడం, మహిళలపై నేరాలను తగ్గించడం వంటి సామాజిక లక్ష్యాలను కలిగి ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వ నియంత్రణ పరిమితులు, ప్రజల సహనం అనే అంశాలపై దృష్టి సారించాయి. పోర్న్‌ను పూర్తిగా నిషేధించడం వల్ల, యువత తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా నిషేధం తరహాలో రోడ్లపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని, అది అదుపు తప్పి హింసకు దారితీయవచ్చనే రాజ్యాంగబద్ధమైన ఆందోళన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల్లో కనిపిస్తోంది.ఇది న్యాయపరమైన అంశం కంటే పాలసీ అంశం అని, కార్యనిర్వాహక వర్గం (Executive) మాత్రమే ఈ విషయంలో జాగ్రత్తగా సమతుల్యత పాటించాలని పరోక్షంగా సూచిస్తోంది.
భారతదేశంలో పోర్న్‌కు బానిసలవడం వల్ల నేరాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. అయినా, కేవలం నిషేధం ద్వారా సమస్యను పరిష్కరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. బదులుగా నియంత్రణ, విద్య, అవగాహన తదితర మార్గాల్లో చేయాలని సూచిస్తోంది. ఐటీ చట్టం 69A కింద చైల్డ్ పోర్నోగ్రఫీ (CSAM), రేప్ వీడియోలు వంటి చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను కఠినంగా నిషేధించాలి. పాఠశాలలు, కుటుంబాల ద్వారా డిజిటల్ పరిజ్ఞానం, సరైన ఇంటర్నెట్ వినియోగం, బాధ్యతాయుతమైన లైంగిక విద్యను అందించాలి. పోర్న్‌కు బానిసలైన వారికి కౌన్సిలింగ్, మానసిక వైద్య సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
పోర్న్‌ను పూర్తిగా నిషేధిస్తే జనరేషన్-జెడ్ లో తీవ్ర నిరసనలకు దారితీసి, అనుకోని పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యపై ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ ప్రజల స్వేచ్ఛను గౌరవిస్తూనే, యువత భవిష్యత్తును కాపాడే సున్నితమైన మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఉంది.







