Badal Vs Khalistan : బాదల్ ఫ్యామిలీకి ఎందుకీ దుస్థితి..? ఖలిస్తానీల జోక్యం ఎందుకు?

పంజాబ్ లో (Punjab) దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తోంది బాదలు కుటుంబం. స్వాతంత్రం వచ్చినప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రకాశ్ సింగ్ బాదల్ (Prakash Singh Badal). శిరోమణి అకాలీదళ్ పార్టీని (Siromani Akali Dal) పెట్టి అంచలంచెలుగా ఎదిగారు. 1970లో తొలిసారి సీఎం అయ్యారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన తన వారసుడిగా కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ (Sukhbir Singh) ను ప్రకటించారు. సుఖ్‌బీర్ సింగ్ కు రాజకీయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోగలిగారు. ఈ క్రమంలో ప్రకాశ్ సింగ్ తో పాటు సుఖ్‌బీర్ సింగ్ కొన్ని తప్పులు చేశారు. వాటికి ఇప్పుడు వాళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తోంది.
అమృత్ సర్ (Amritsar) లోని గోల్డెన్ టెంపుల్ (Golden Temple) లో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, అకాలీదళ్ (SAD) నేత సుఖ్‌బీర్ సింగ్ పై కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రస్తుతం ఆయన మతానికి ద్రోహం చేసిన వ్యక్తిగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సమయంలో సుఖ్‌బీర్ సింగ్ పై కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. పంజాబ్ లో అకాలీదళ్ దశాబ్దాలుగా పెత్తనం సాగిస్తోంది. బాదల్ కుటుంబాన్ని ఇక్కడి వాళ్లంతా ఫస్ట్ ఫ్యామిలీగా పిలుచుకుంటూ ఉంటారు. వీళ్లకు ఎలాగైనా చెక్ పెట్టాలని ఖలిస్తాన్ (Khalisthan) ట్రై చేస్తోంది. గతంలో భింద్రన్ వాలాపై సైనిక చర్యలకు అకాలీదళ్ మద్దతు ప్రకటించిందని మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు. ఇది ఖలిస్తానీలకు నచ్చలేదు. ఖలిస్థాన్ కు మద్దతుగా పనిచేసే బబ్బర్ ఖల్సాకు చెందిన నరైన్ చౌరా అనే వ్యక్తి ఇప్పుడు సుఖ్‌బీర్ సింగ్ పై కాల్పులు జరిపారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ లేని పంజాబ్ రాజకీయాలను ఊహించుకోలేం. కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా పని చేశారు. ఈయన భార్య హర్ సిమ్రత్ కౌర్ (Har Simrath Kaur) కూడా కేంద్ర మంత్రిగా పని చేశారు. కుమార్తె ప్రణిత్ కౌర్ కైరాన్, ఆమె భర్త ఆదేశ్ ప్రతాప్ సింగ్ కైరాన్ కూడా అకాలీదళ్ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే రానురాను అకాలీదళ్ ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. 2007-17 మధ్య అధికారంలో ఉన్నప్పుడు మతపరంగా తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. ఇప్పుడు సుఖ్‌బీర్ సింగ్ కు ఆ వ్యవహారంలోనే శిక్షపడింది. ఆయన క్షమాపణలు చెప్పినా మతపెద్దలు ఆయనకు శిక్ష విధించారు.
బాదల్ కుటుంబం సిక్కులకు ద్రోహం చేసిందని ఖలిస్థానీలు భావిస్తున్నారు. అందుకే వాళ్లకు తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ప్రత్యేక సిక్కు దేశం కోసం పోరాడుతోంది ఖలిస్తాన్. దీనికి బబ్బర్ ఖల్సా (Babbar Khalsa) లాంటి సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. అకాలీదళ్ మాత్రం సిక్కు ప్రయోజనాలకోసమే పుట్టిన పార్టీ. ప్రత్యేకదేశం కావాలనే డిమాండ్ కు అకాలీదళ్ వ్యతిరేకం. దీన్ని ఖలిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. పంజాబ్ లో ఎలాగైనా అకాలీదళ్ పెత్తనానికి చెక్ పెట్టాలనుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు సుఖ్‌బీర్ సింగ్ పై కాల్పులు జరిపి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కాల్పుల అనంతరం కూడా సుఖ్‌బీర్ సింగ్ తన గోల్డెన్ టెంపుల్ లో తనకు విధించిన శిక్షను కొనసాగిస్తున్నారు. సేవ చేస్తున్నారు.