Mission D-6: ఆరునగరాలు టార్గెట్..ఉగ్ర నెట్ వర్క్ లో షాహిన్ షాహిద్ కీలక పాత్ర
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన దర్యాప్తు సందర్భంగా కీలక విషయాలు వెలుగుజూస్తున్నాయి.
మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహిన్ షాహిద్ (Shaheen Shahid).. ఉగ్రనెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించింది. ఈ నెట్వర్క్ ఆరు నగరాలు లక్ష్యంగా డీ-6 మిషన్‌కు ప్లాన్ చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏఏ నగరాలను లక్ష్యంగా చేసుకోవాలి, నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో సమాచార మార్పిడి వంటి ప్లాన్స్ బయటకువస్తున్నాయి.
ఫరీదాబాద్‌లో అరెస్టయిన షాహిన్.. టెర్రర్ మాడ్యూల్ (Faridabad Terror Module)కు కీలక వ్యక్తి. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్ ఫైల్స్ ఇప్పుడు ముఖ్యమైన ఆధారాలుగా మారాయి. డిసెంబరు 6న భారీ కుట్ర చేసేందుకు ఈ నెట్వర్క్ ప్లాన్ చేసినట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఎర్రకోట పేలుడు బాంబర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, షాహిన్ ఈ మాడ్యూల్లో భాగం. వీరికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నాయి. విచారణలో భాగంగా షాహిన్ ఖాతాలను ఆడిట్ చేస్తున్నారు. ఢిల్లీ, కాన్పుర్, లఖ్‌నవూలో ఉన్న ఏడు బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు.
ఇక, టెర్రర్ మాడ్యూల్‌లోని సభ్యులు ఐఎస్ఐ హ్యాండ్లర్ ఉకాసాను కలిసేందుకు తుర్కియేలో పర్యటించారని తెలుస్తోంది. ఉకాసా అంటే అరబిక్‌లో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో పాటు అన్సర్ ఘజ్వత్- ఉల్ హింద్ అనే సంస్థల నిర్వాహకులకు ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ ఉమర్‌తో పాటు అతడి సహచరులు ఈ ఉకాసా హ్యాండ్లర్‌తో సంభాషించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్ ఉమర్ (Dr Umar Un Nabi)తో సహా పలువురు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అంకారాలో వారు రెండు వారాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ హ్యాండ్లర్ కూడా అంకారాలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పర్యటనలో డిసెంబర్ 6 దాడికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.






