వ్రతం చెడ్డా ఫలితం దక్కిందప్పా సిద్దప్పా..!

ప్రైవేటు, కార్పొరేటు సంస్థల్లో సైతం కన్నడిగులకే 75 శాతం రిజర్వేషన్లు ఉండాలంటూ ఓ జీవో జారీ చేసిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. కరెక్టు సమయంలో కరెక్టు పాచికే విసిరారు.ఎందుకంటే ఇది కన్నడ యువతకు ఓ అందమైన ప్రక్రియ. ఎందుకంటే బెంగుళూరు ఐటీ పరిశ్రమలో అత్యధికులు వేరే రాష్ట్రాల వాళ్లే. వారికే ఉద్యోగాలు.. చక్కని లైఫ్.. అన్నీ కళ్లముంగిటే కనిపిస్తున్నాయి. కానీ .. సొంత రాష్ట్రంలో కన్నడిగులకు మాత్రం ఆస్థాయి జీవితం దక్కడం లేదు. ఇదే కన్నడిగుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. అందుకే ఎప్పటికప్పుడు లోకల్ రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తోంది.
మరోవైపు.. ప్రస్తుతం సిద్ధరామయ్యకు.. పార్టీలో ఇబ్బందులు తప్పడం లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న డికె శివకుమార్ ను సీఎంను చేయాలంటూ ఇప్పటికే పలువురు సీనియర్లు, మఠాధిపతులు సైతం బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీనికి తోడు డికె శివకుమార్ కెపాసిటీ కూడా సిద్ధరామయ్యకు తెలుసు. ఉన్నపళంగా పదవి అప్పగించినా, ఏమాత్రం తొట్రుపాటు లేకుండా నిర్వహించగల సత్తా డికెకు ఉంది. దీంతో ఇది ఎక్కడ తన పదవికి చేటు తెస్తుందా అన్న ఆందోళన కూడా సిద్ధరామయ్యలో ఉందన్న అభిప్రాయాలున్నాయి. అందుకే సరైన సమయం చూసి చక్కని పాచిక విసిరారు సిద్ధూ.
ఇప్పుడు ప్రైవేటు సంస్థల్లోనూ రిజర్వేషన్లు అంటూ సిద్ధరామయ్య తెచ్చిన జీవో.. యువతలోకి బలంగా పోయింది. ప్రస్తుతానికి ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ఒత్తిడితో వెనకడుగు వేసినా.. ఎన్నికల ముందైనా సరే మరోసారి ఈ అంశం తెరపైకి రాకపోతుందా అన్న అభిప్రాయం యూత్ లో ఉంది. దీనికి తోడు ఈ వ్యవహారం ముందుకు వెళ్లదన్న సంగతి.. అత్యంత సీనియర్ నేత అయిన సిద్ధరామయ్యకు తెలుసు. అందుకే ఓ పాచిక విసిరారు. అది పారింది. ఇప్పుడు సిద్ధరామయ్యను ఎవరూ టచ్ చేయలేరు. అది కాంగ్రెస్, అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా…
దీని ప్రభావం ఎంతలా ఉందంటే.. విపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ కనీసం స్పందించేందుకు కూడా ఆలోచిస్తున్నాయి. సిద్ధూపై విమర్శలు ఎక్కుపెడితే.. అది కాస్తా యూత్ ఓటు బ్యాంకుపై పడుతుందా అన్న ఆందోళన ఆపార్టీనేతల్లో ఉంది. ఇక హైకమాండ్ సైతం సిద్ధరామయ్య చర్యతో కాస్త హ్యాపీగానే ఉండి ఉంటుంది. లేకుంటే తమకు చెప్పకుండా సిద్ధరామయ్య ఇంత నిర్ణయం తీసుకుంటే.. హైకమాండ్ ఊరుకుంటుందా..? అంటే వ్రతం చెడ్డా.. ఫలితాన్ని మాత్రం కాంగ్రెస్ సాధించిందని చెప్పొచ్చు.