Putin: భారత్ కు పుతిన్.. రష్యా అధ్యక్షుడి టూర్ పై ప్రపంచం ఫోకస్..
రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడంపై ఇప్పటికే అమెరికా భారీగా టారిఫ్ లు విధిస్తోంది. ఇవికాక మరిన్ని విధిస్తామని.. హెచ్చరిస్తోంది. ఓవైపు మిత్రుడంటూనే .. గట్టిగానే ఇబ్బందులు పెడుతోంది.ఈ క్రమంలో భారత్ కూడా తన ప్రయోజనాలను పరిరక్షించుకునే పనిలో పడింది. తాము రష్యాతో చేస్తున్నది బిజినెస్ అన్న భారత్.. ఎక్కడ తక్కువకు ఆయిల్ దొరికితే అక్కడే కొంటామని స్పష్టం చేసింది కూడా . అయితే తమకు ఇంతగా అండగా నిలుస్తున్న భారత్ కు.. రష్యా కూడా అదేస్థాయిలో దన్నుగా నిలుస్తోంది.
భారత్తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. రవాణాలో పరస్పర మార్పిడి సహకారానికి (రెలోస్) గత ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి సై అంది. గురు, శుక్రవారాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సభ ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. పుతిన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న ఈ తరుణంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని పుతిన్ తెలిపారు. ‘గత మూడేళ్లలో ఈ దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించింది. ఇంధనం, పారిశ్రామికం, అంతరిక్షం, ఇతర రంగాల్లో ఇప్పటికే ఎన్నో సంయుక్త భాగస్వామ్యాలున్నాయి. నా భారత్ పర్యటనలో ఆర్థిక అంశాలపైనా చర్చిస్తాం’ అని పుతిన్ తెలిపారు.
రెలోస్ ఎంతో కీలకం
రెలోస్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక నిర్మాణాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల పరస్పర మార్పిడి ఉంటుంది. బలగాల పంపిణీలోనే కాకుండా పరికరాలు, రవాణానూ రెలోస్ నియంత్రిస్తుంది. ఈ ఏర్పాటును సంయుక్త విన్యాసాలు, శిక్షణ, మానవతా సాయం, విపత్తుల సమయంలో వినియోగిస్తారు. డ్యూమా వెబ్సైట్లో నోట్ ప్రకారం.. రష్యా పార్లమెంటు ఆమోదించిన పత్రాల్లో.. రెండు దేశాల గగన తలాన్ని, పోర్టులను రష్యా, భారత్ యుద్ధ నౌకలు వినియోగించుకుంటాయి.






