యూపీఎస్సీకి కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుడాన్…

1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్ గా నియమితులయ్యారు. నెల రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేశారు. మనోజ్ సోనీ స్థానంలో ప్రీతీ సుడాన్ ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రీతి సుడాన్ ప్రస్థానం..
ప్రీతి సుడాన్ 2022 సంవత్సరంలో యూపీఎస్సీలో చేరారు. తాజాగా ఆమె చైర్ పర్సన్ పదవికి నియమితులయ్యారు. హర్యానా నివాసి ప్రీతి సుడాన్… 1983లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మహిళా, శిశు అభివృద్ధి & రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు.. ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రీతి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్. 37 సంవత్సరాల విస్తృత అనుభవంతో జూలై 2020లో కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
యూపీఎస్సీలో చేరిన తర్వాత ఆమె చాలా ముఖ్యమైన నిర్ణయాలలో భాగస్వాములయ్యారు. బేటీ బచావో, బేటీ పడావో ప్రచారం, ఆయుష్మాన్ భారత్ మిషన్ , నేషనల్ మెడికల్ కమిషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ కమీషన్ పనికి దోహదపడ్డారు. ఈ-సిగరెట్‌ల నిషేధంపై చట్టం చేసిన ఘనత ప్రీతి సుడాన్ కు దక్కింది. ప్రీతి సుడాన్ విద్యార్హత గురించి చూస్తే., ఆమె ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్ డిగ్రీ చేశారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ సైన్స్ LSE, లండన్ నుండి సోషల్ సైన్స్‌లో MSc చేసారు.
యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులు నేరుగా రాష్ట్రపతిచే నియమింపబడతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316(1) ప్రకారం ఈ నియామకం జరుగుతుంది. కనీసం సగం మంది సభ్యులు సివిల్ సర్వీస్‌లో సభ్యులుగా ఉన్నవారు (పనిచేస్తున్నవారు లేదా పదవీ విరమణ పొందినవారు) భారత ప్రభుత్వం లేదా రాష్ట్రం క్రింద కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఆర్టికల్ 317 ప్రకారం, రాష్ట్రపతి మాత్రమే.. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను వారి పదవుల నుండి తొలగించగలరు. యూపీఎస్సీ సభ్యులు చేరిన తేదీ నుండి 6 సంవత్సరాలు లేదా వారు 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు (ఏది అంతకు ముందు అయితే) వారి పదవులను కలిగి ఉంటారు. రాష్ట్ర కమిషన్ లేదా జాయింట్ కమిషన్ సభ్యులకు వయోపరిమితి 62 సంవత్సరాలు.