Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ..చంద్రబాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) చేసిన నెల్లూరు (Nellore) పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. హెలిప్యాడ్ వద్ద నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకగా, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) జైలులో ఉన్న సందర్భంలో ఆయనను పరామర్శించడం, అలాగే మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) నివాసానికి వెళ్లిన సందర్భం రాజకీయ చర్చలకు దారితీసింది.
ఈ పర్యటన సందర్భంగా ఆయనపై భద్రతా ఆంక్షలు విధించడాన్ని జగన్ తీవ్రంగా విమర్శించారు. హెలిపాడ్ వద్ద పది మందికే అనుమతి, జైలు ములాఖత్‌కు ముగ్గురు మాత్రమే అనేదాన్ని విశేషంగా తప్పుబట్టారు. రోడ్లను తవ్వి కార్యకర్తల రాకను అడ్డుకున్నారని, ఇది అసాధారణ పరిణామమని చెప్పారు. పోలీసులు ప్రజలను అడ్డుకునేందుకే నియమించారని ఆరోపించారు.
అనంతరం జరిగిన సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలవుతోందని, ప్రజాస్వామ్య విలువలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు (Chandrababu Naidu) పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన, కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. ప్రజలను ప్రశ్నించేవారిని అణచివేస్తున్నారని, తన నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి జరిగిందని, మారణాయుధాలతో ఇంటిపైకి దాడికి పంపించారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడం తో తప్పించుకున్నారన్న జగన్, ఇది ప్రాణహానికి దారి తీసే స్థితి అని చెప్పారు. అలాగే కాకాణిపై పెట్టిన కేసులు పూర్తిగా ప్రణాళికబద్ధంగానే పెట్టబడ్డాయని చెప్పారు.
లిక్కర్ స్కాం (Liquor Scam)పై కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం అమ్మకాలపై అధిక రేట్లు వసూలు చేస్తూ, పర్మిట్ రూం పేరుతో అక్రమ వ్యాపారం జరుగుతోందన్నారు. కమీషన్ల వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ (Lokesh) పాత్ర ఉందని ఆరోపించారు.చివరగా, మూడేళ్లలో తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి తప్పు చేసినవారిని చట్టం ముందు నిలబెడతామని, వారు విదేశాలకు వెళ్లినా శిక్ష తప్పదని హెచ్చరించారు. మొత్తానికి ఇలా వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…