Breakfat Politics: కర్ణాటక ‘బ్రేక్‌ఫాస్ట్’ పాలిటిక్స్ వెనుక అసలు కథేంటి..!?
కర్ణాటక రాజకీయాలు (Karnataka Politics) గంటకో మలుపు, రోజుకో ట్విస్ట్ తీసుకుంటున్నాయి. నిన్నటి దాకా ఢిల్లీ వేదికగా నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డ సిద్దరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Siva Kumar)… ఇప్పుడు బెంగళూరులో నువ్వు-నేను అంటూ భాయి-భాయి అంటున్నారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌లు (Breakfast) చేస్తున్నారు. ప్లేట్లలో ఇడ్లీ, దోశెలతో పాటు రాజకీయ వ్యూహాలను కూడా పంచుకుంటున్నారు. పైకి అంతా ఆల్ ఈజ్ వెల్ అనిపిస్తున్నా… ఈ నవ్వుల వెనుక పెద్ద రాజకీయ యుద్ధమే దాగి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్ కేవలం ఒక సినిమాటిక్ ఇంటర్వెల్ మాత్రమేనని అనుమానిస్తున్నారు.
మొన్నటి వరకు కర్ణాటక సీఎం పీఠం కదులుతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. ముడా (MUDA) స్కామ్ ఆరోపణలతో సిద్దరామయ్య ఇరకాటంలో పడటంతో, ఇదే అదనుగా డీకే శివకుమార్ సీఎం కుర్చీ కోసం ఢిల్లీలో భారీ స్కెచ్ వేశారన్నది బహిరంగ రహస్యం. ఇద్దరూ అధిష్టానం పెద్దలను కలిశారు. కానీ, ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. నిన్న సిద్దరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈరోజు డీకే శివకుమార్ నివాసానికి సిద్దరామయ్య వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ పెట్టారు. బయటకు మేమిద్దరం కలిసే ఉన్నాం, ప్రభుత్వానికి ఢోకా లేదని సంకేతాలిచ్చారు.
కానీ, రాజకీయాల్లో కనిపించేది వేరు.. జరిగేది వేరు! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరికీ గట్టి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. కొంత కాలం పాటు కర్ణాటకలో ఎలాంటి కుమ్ములాటలు ఉండకూడదని రాహుల్ గాంధీ, ఖర్గే సీరియస్‌గా ఆదేశించారని సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో, కర్ణాటకలో గొడవలు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తాయని హైకమాండ్ భావిస్తోంది. మీ ఇద్దరి గొడవల్లో బీజేపీ ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేస్తుందన్న భయం అధిష్టానానికి ఉంది. అందుకే, మీరు లోపల కొట్టుకున్నా పర్లేదు.. బయట మాత్రం నవ్వుతూ ఫోటోలకు ఫోజులివ్వండి అని ఢిల్లీ పెద్దలు స్క్రిప్ట్ రాసి పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్ ఆ స్క్రిప్ట్‌లో భాగమేనని అనుమానం!
సిద్దరామయ్య చాలా సీనియర్ పొలిటికల్ మాస్టర్ మైండ్. ఇప్పుడు డీకే ఇంటికి వెళ్లడం వెనుక ఆయనకు రెండు లక్ష్యాలున్నాయి. MUDA కేసు నుంచి డైవర్షన్ మొదటిది. తనపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి, పాలనపైనే మా ధ్యాస అని చూపించడం ఆయన ముందున్న లక్ష్యం. డీకే శివకుమార్ పక్కనే ఉంటూ, ఆయన తిరుగుబాటు చేయకుండా వ్యూహాత్మకంగా లాక్ చేయడం రెండోది. “నేను నీ ఇంటికి వచ్చాను, నీతో చర్చిస్తున్నాను, ఇక నీకు అసంతృప్తి ఎందుకు?” అనే మెసేజ్ ఇవ్వడం.
డీకే శివకుమార్ ప్రస్తుతానికి తగ్గినట్టు కనిపిస్తున్నా, అది వ్యూహాత్మక మౌనమే అని ఆయన వర్గీయులు అంటున్నారు. ముడా కేసులో కోర్టు తీర్పులు లేదా ఈడీ (ED) విచారణ ఎటు తిరుగుతుందో అని డీకే వేచి చూస్తున్నారు. సిద్దరామయ్యను కోర్టులు లేదా దర్యాప్తు సంస్థలు ఇబ్బంది పెట్టినప్పుడు, ఆటోమేటిక్‌గా అధిష్టానం తనవైపే చూడక తప్పదని డీకే నమ్ముతున్నారు. అప్పటి వరకు గుడ్ బాయ్ లా ఉండటమే బెటర్ అని ఆయన డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్నది శాంతి ఒప్పందం కాదు, కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ మాత్రమే. ఇద్దరి మధ్య నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. సిద్దరామయ్య తన అహిందా (AHINDA) ఓటు బ్యాంకును నమ్ముకుంటే, డీకే తన వొక్కలిగ సామాజికవర్గాన్ని, ఆర్థిక బలాన్ని నమ్ముకున్నారు. పదవీకాలం సగం పూర్తయ్యాక సీఎం సీటు డీకేకి ఇవ్వాలన్న డిమాండ్ ఇంకా సజీవంగానే ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ స్నేహాలు బ్రేక్ అవ్వడం ఖాయం.
మొత్తానికి, దోశెలు తింటూ వీరు ఇస్తున్న ఫోజులు కార్యకర్తలను నమ్మించడానికే తప్ప, మనసులను కలపడానికి కాదు. పైకి స్నేహ గీతం వినిపిస్తున్నా.. లోపల మాత్రం కుర్చీలాట రణతంత్రం నడుస్తూనే ఉంది. కర్ణాటక రాజకీయాల్లో ఈ శాంతి ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి. ఎందుకంటే, ఇది బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం!






