Rahul Gandhi: హర్యానాలో ‘ఓట్ల చోరీ’పై రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబ్..!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) హర్యానా (Haryana) రాష్ట్ర ఎన్నికల ప్రక్రియపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చిన ఆయన హైడ్రోజన్ బాంబ్ పేరుతో పలు అంశాలు వెల్లడించారు. హర్యానా ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వివరించారు. ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున ఫేక్ ఓటర్లు (Fake Voters) ఉన్నారని, దీని వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (EC)ల హస్తం ఉందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
హర్యానాలోని ప్రతీ 8 మంది ఓటర్లలో ఒకరు ఫేక్ ఓటరే అని రాహుల్ గాంధీ అత్యంత సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 12.5 శాతం మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ఇది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఆయన పలు ఆధారాలనుప ప్రదర్శించారు. బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ కు హర్యానా ఓటర్ల జాబితాలో చోటు దక్కిందన్నారు. సీమ, స్వీటీ, సరస్వతి అనే వేర్వేరు పేర్లతో ఓటు హక్కు నమోదు చేసుకుందని ఆయన ఆరోపించారు. అలాగే ఒకే మహిళ, ఒకే ఫొటోను ఉపయోగించి వేర్వేరు పోలింగ్ బూత్‌లలో వందసార్లు ఓటు వేసినట్లు జాబితాలో నమోదైందని సాక్ష్యాధారాలతో సహా చూపించారు.
పోలింగ్ సందర్భంగా బూత్ లెవల్ నుంచే ఈ అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ వివరించారు. ఎవరైనా ఓటు హక్కు పొందాలంటే ఇంటి నెంబర్ తప్పనిసరి. అయితే ఇళ్లు లేని నిరుపేదలకు దీని వల్ల ఇబ్బంది కలుగుతోంది. అందుకే ఇంటి నెంబర్ స్థానంలో జీరో పేర్కొనే వెసులుబాటును ఈసీ కల్పించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది అక్రమార్కులు జీరో ఇంటి నెంబర్ తో పలువురిని ఓటరు జాబితాలో చేర్చారు. అక్రమ ఓటర్లు, ఫేక్ ఓటర్లకు జాబితాలో చోటు కల్పించాలనే దురుద్దేశంతోనే ఈ వెసులుబాటును ఈసీ కల్పించిందని రాహుల్ ఆరోపించారు. భారీ భవంతి కలిగిన ఓ ఓటరు జీరో నెంబర్ తో రిజిస్టర్ అయిన దృశ్యాన్ని ఆయన స్క్రీన్ పై చూపించారు. ఇంత పెద్ద భవనానికి ఇంటి నెంబర్ లేదని, ఈ ఇంటి యజమాని పేరు సహా పలువురు అక్రమార్కులకు ఈ జీరో నెంబర్ విధానం ద్వారా ఓటు హక్కు కల్పించారని రాహుల్ గాంధీ సాక్ష్యాలు చూపించారు.
ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే ఈ అక్రమాలను కేవలం క్షణాల వ్యవధిలోనే తొలగించగలదని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఈ అక్రమాలు కొనసాగడానికి కేంద్రంలోని బీజేపీకి ఈసీ వంతపాడుతోందని విమర్శించారు. బీజేపీ అక్రమాలకు ఈసీ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. దేశంలో ఓట్ల చోరీపై కొంతకాలంగా రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారు. ‘H Files’ పేరుతో ఇవాళ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది.







