Delhi: శాంతి శరణం గచ్చామి.. పుతిన్ పర్యటన వేళ మోడీ పునరుద్ఘాటన..!
చిరకాలమిత్రుడు.. ఆపద సమయంలో అండగా నిలుస్తున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్(Putin) ఢిల్లీ పర్యటన సందర్భంగా భారత్.. తన వైఖరిని కుండబద్దలు కొట్టింది.భారతదేశం తటస్థంగా లేదని శాంతిపక్షాన ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు (Putin India Visit). పుతిన్, రష్యా ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన ఆయన.. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన దగ్గరి నుంచి తమ రెండు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి ప్రతి విషయాన్ని తమకు వెల్లడించారని, పుతిన్ (Putin) ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచిందని మోడీ ఈ భేటీ సందర్భంగా వెల్లడించారు. చర్చలు, శాంతియుతంగా వివాదాల పరిష్కారంపై భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య నమ్మకం అనేది ఒక గొప్ప బలంగా ఉందని పేర్కొన్నారు. దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని, ఇరువురం కలిసి ప్రపంచాన్ని ఆ మార్గంలో నడిపిద్దామని వ్యాఖ్యానించారు. ఇటీవలికాలంలో జరుగుతోన్న ప్రయత్నాలతో ఈ ప్రపంచం మరోసారి శాంతి దిశగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తమ చిరకాల స్నేహం.. పుతిన్ వ్యూహాత్మక విజన్‌ను ప్రతిబింబిస్తోందన్నారు.
మరోవైపు.. ఉక్రెయిన్‌లో ‘శాంతియుత పరిష్కారం’ కోసం రష్యా కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన వివరాలను భారత్‌తో పంచుకున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. భారత్, ప్రధాని మోడీ (PM Modi) నుంచి లభించిన ఆత్మీయ స్వాగతం గురించి ప్రస్తావించి, కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు దేశాల బంధం దశాబ్దాల క్రితమే పెనవేసుకుందన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. సైనిక ఘర్షణ కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యకు పరిష్కారం లభించాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.






