Jagan: 2029 ఎన్నికల ముందస్తు సన్నాహాలు – వైసీపీకి పొత్తులు తప్పవా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) గుర్తింపు తెచ్చుకుంటుంది. సుమారు పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో ఈ పార్టీ “సింగిల్” వ్యూహాన్నే నమ్మింది. పొత్తులు, మైత్రులు అనే పదాలకు దూరంగా ఉండి స్వతంత్రంగా ముందుకెళ్లడం వైసీపీ (YCP) లక్షణమైంది. “సింహం సింగిల్గానే వస్తుంది” అనే నినాదంతో ఆత్మవిశ్వాసంగా అడుగులు వేసినా, ప్రతి కాలం ఆ వ్యూహానికి అనుకూలంగా ఉండకపోవడంతో పార్టీకి ఎదురు దెబ్బలు తప్పలేదు.
దేశంలో ఎక్కువ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు మైత్రి రాజకీయాలు అవలంబించాయి. కానీ వైసీపీ మాత్రం ఈ మార్గాన్ని తప్పించుకుంది. ఈ నిర్ణయం మూడు ఎన్నికల్లో రెండు సార్లు చేదు అనుభవాలను తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో వైసీపీకి ఓట్ల శాతం 40 ఉన్నా సీట్లు కేవలం 11కి పరిమితమయ్యాయి. ఇది పార్టీ బలాన్ని సూచించినా, అధికారానికి దూరంగా ఉంచే ఫలితమైందని చెబుతున్నారు. తగిన రాజకీయ బలం ఉన్నా సరైన వ్యూహం లేకపోవడం వల్లే ఇంత పెద్ద దెబ్బ తగిలిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో పొత్తులు ఒక శక్తివంతమైన వ్యూహమని కాలం చాటింది. తెలుగుదేశం పార్టీ (TDP) ఈ అంశాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ విజయాలు సాధించింది. అదే సమయంలో వైసీపీ పొత్తులను ఎద్దేవా చేసింది. ఈ నిర్ణయమే చివరికి ఆ పార్టీకి రాజకీయ నష్టాన్ని తెచ్చింది. ఇప్పుడు వైసీపీ దశ ఆలోచనల దశగా మారింది. 2029 ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఎదుర్కోవాలంటే వైసీపీ ఒంటరిగా సాధించలేనని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), వామపక్షాలు (Left Parties), ఇతర చిన్న పార్టీలు ప్రతిపక్ష వేదికపై ఉన్నారు. ఈ వర్గాలను వైసీపీ కలుపుకుంటే, రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలదని విశ్లేషకుల అభిప్రాయం. అయితే వైసీపీకి “సింగిల్” అనే భావన ఇంకా బలంగానే ఉంది. పార్టీ అంతర్గతంగా కూడా పొత్తుల వల్ల తమకు నష్టం జరుగుతుందని కొందరు నేతలు అంటున్నారు. కానీ అధికారాన్ని కోల్పోవడం పార్టీ మొత్తానికి నష్టం అవుతుందనే మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఇక వైసీపీ చుట్టూ ఉన్న రాజకీయ పరిమితులు కూడా తక్కువ కావు. జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ (Jadd Shravan Kumar) ఇప్పటికే వైసీపీతో పొత్తుకు ఆసక్తి చూపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీఎస్పీ (BSP) వంటి పార్టీలు కూడా వైసీపీ వైపు చూస్తున్నాయి. వామపక్షాల్లో సీపీఎం (CPM) కాస్త సానుకూలంగా ఉన్నా, సీపీఐ (CPI) వైఖరి స్పష్టంగా తెలియడం లేదు. ఇవన్నీ ఇండియా కూటమిలో భాగమవ్వడంతో కాంగ్రెస్ సహకారం లేకుండా పొత్తు సాధ్యం కానట్టుగా కనిపిస్తోంది.
తదుపరి ఎన్నికల ముందు వైసీపీ పొత్తులు కట్టే పరిస్థితి తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీహార్ (Bihar) తరువాత దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ వాతావరణం ఏపీ మీద ప్రభావం చూపవచ్చని అంచనాలు ఉన్నాయి. చిన్నపార్టీలు ఇప్పటికే వైసీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ , వామపక్షాలు కూడా వైసీపీ ముందడుగు వేస్తే వెనకడుగు వేయవని భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ దీర్ఘకాలంగా కొనసాగించిన ఒంటరితనం ఈసారి ముగిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ తిరిగి ఒంటరి పోరుకు సై అంటారా లేక పొత్తుల వైపు మొక్కు చూపుతారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.







