Prashant Kishor: బీహార్‌లో పనిచేయని ప్రశాంత్ కిశోర్ ‘వ్యూహాలు’..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయే (NDA) కూటమి అఖండ విజయం సాధించగా, ఇండియా కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) . ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ (PK).. జన సురాజ్ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే పీకే పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కింగ్ కాకపోయినా, కనీసం కింగ్ మేకర్‌గా ఎదగాలనే ఆయన వ్యూహం తుడిచిపెట్టుకుపోయింది. ఇది కేవలం పీకే వ్యక్తిగత వైఫల్యంగానే కాకుండా, ఆధునిక భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్రపై ఆధారపడిన పార్టీలన్నింటికీ ఓ గుణపాఠం అని చెప్పొచ్చు.
ప్రశాంత్ కిశోర్ గత దశాబ్ద కాలంగా భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచారు. 2014లో నరేంద్ర మోదీ, 2015లో నితీష్ కుమార్, 2017లో అమరీందర్ సింగ్, 2019లో జగన్మోహన్ రెడ్డి, 2021లో మమతా బెనర్జీ… ఇలా అనేక రాష్ట్రాల్లో, వివిధ సిద్ధాంతాలు కలిగిన రాజకీయ నాయకులను అధికారంలోకి తీసుకురావడంలో పీకే వ్యూహాలు అద్భుతంగా పనిచేసాయి. ఆయన వ్యూహ చతురత, క్షేత్రస్థాయి పరిశోధన, మెరుగైన ప్రచార పద్ధతులు, సోషల్ ఇంజనీరింగ్‌లను పార్టీలు అస్త్రాలుగా వాడుకున్నాయి.
అయితే, వ్యూహకర్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన పీకే, స్వయంగా రాజకీయ నేతగా మారిన తర్వాత మాత్రం ఘోర వైఫల్యాన్ని చవిచూశారు. బీహార్‌లో తన పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. కనీసం 7-8 శాతం ఓట్లను సాధించవచ్చని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, ఆ అంచనాలు కూడా తప్పాయి. చివరికి, పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాలేదు. దీంతో ప్రశాంత్ కిశోర్‌కు చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. కేవలం వ్యూహాలు, ప్రచారం, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా అధికారం లభించదని ప్రశాంత్ కిశోర్ స్టోరీ తెలియజేస్తోంది. ప్రజాబలం, పార్టీ నిర్మాణం, నాయకులపై నమ్మకం అనే పునాదులు బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగలదని నిరూపించింది.
బీహార్ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ బొక్కబోర్లా పడటానికి అనేక కారణాలున్నాయి. ఎన్నికల ముందు పీకే చేసిన పాదయాత్రలు, క్షేత్రస్థాయి పర్యటనలు మీడియాలో హైలైట్ అయ్యాయి. కానీ, ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన బలమైన సంస్థాగత నిర్మాణం, ప్రతి బూత్‌లో పనిచేసే కార్యకర్తల వ్యవస్థ జన సురాజ్‌కు కొరవడింది. పీకే వ్యూహకర్తగా వేలాది కోట్లు సంపాదించి, పదుల సంఖ్యలో పార్టీలతో పనిచేసిన చరిత్ర ఉంది. ఇది ఆయన నిజాయితీ, చిత్తశుద్ధిపై ప్రజల్లో, ఇతర రాజకీయ పార్టీల్లో కొంత సందేహాన్ని కలిగించింది. ఎన్నికల వ్యూహకర్త నుండి పూర్తిస్థాయి ప్రజా నాయకుడిగా మారే క్రమంలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారు. పీకే బీహార్‌లోని ప్రధాన సమస్యలను హైలైట్ చేసినా, వాటి పరిష్కారం కోసం స్పష్టమైన, నమ్మదగిన విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఎన్నికలు తుది ఘట్టానికి చేరేసరికి, సంప్రదాయ కుల, మత, సంక్షేమ రాజకీయాలు మళ్లీ పైచేయి సాధించాయి.
ప్రశాంత్ కిశోర్ ఓటమి దేశంలోని అనేక ప్రాంతీయ, జాతీయ పార్టీలకు హెచ్చరికగా నిలుస్తుంది. కొన్నేళ్లుగా అనేక పార్టీలు తమ సొంత నాయకత్వ, సంస్థాగత లోపాలను కప్పిపుచ్చడానికి, ‘ఎన్నికల వ్యూహకర్తల’పై పూర్తిగా ఆధారపడుతున్నాయి. కోట్లు ఖర్చు చేసి వారి సేవలను వాడుకుంటున్నాయి. అయితే, వ్యూహకర్తలు కేవలం మార్కెటింగ్ నిపుణులుగా పనిచేస్తారు. వాళ్లు ఒక బ్రాండ్‌ను మెరుగ్గా ప్రచారం చేయగలరు, కానీ ఆ బ్రాండ్‌కు ప్రాణం పోయలేరు. ప్రజా ఉద్యమాలు, బలమైన నాయకత్వం, ప్రజల కష్టాలను పంచుకునే వారే తుది విజయాన్ని సాధిస్తారు. ప్రజలు డబ్బును చూసి, లేదా అద్భుతమైన ప్రచారాన్ని చూసి ఓటు వేయరు. తమకు నచ్చిన, తమకు అండగా ఉంటారని నమ్మిన నాయకుడికే ఓటు వేస్తారు.
పీకేకి లభించిన ఈ చేదు అనుభవం ద్వారా మనకు ఓ విషయం అర్థమవుతోంది. భారత రాజకీయాలు ఇంకా ప్రజల మనసుల్లో బలంగా ఉన్న పాత పద్ధతుల చుట్టూనే తిరుగుతున్నాయని తేలింది. కేవలం వృత్తిపరమైన వ్యూహాలు వాటిని ఓడించలేవని నిరూపించింది. వ్యూహకర్తల సహాయం అవసరమే, కానీ ఆ వ్యూహాలు ప్రజల ఆమోదం, ప్రజాబలం అనే పునాదిపై మాత్రమే పనిచేస్తాయి. ఈ ఫలితాలు వ్యూహకర్తల హవాకు ఫుల్స్టాప్ పెట్టకపోవచ్చు, కానీ వారి ప్రభావాన్ని, ప్రాధాన్యతను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి.






