పీకే పార్టీ ఏర్పాటుకు టైమ్ ఫిక్స్..

ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన కొత్తపార్టీకి రంగం సిద్ధం చేశారు. జన్ సురాజ్ అభియాన్ ….రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు ముహూర్తం నిశ్చయమైంది. అక్టోబర్ 2వ తేదీన పార్టీగా 'జన్ సురాజ్' అవతరించనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా ఎనిమిది రాష్ట్ర స్థాయి సమావేశాలను 'జన్ సురాజ్' చేపట్టనుంది. రాబోయే మరికొద్ది వారాల్లో ఈ సమావేశాల తేదీలు ఖరారవుతాయి. బీహార్ వ్యాప్తంగా లక్షన్నర మందిని సమీకరించాలని నిర్ణయించింది.
కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ఫైనలైజ్ చేయడం 'జన్ సురాజ్' సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉంది. నాయకత్వ నిర్మాణం, పార్టీ రాజ్యాంగం, పార్టీ ప్రాధాన్యతా క్రమాలపై సమావేశాల్లో చర్చిస్తారు. ఇందుకోసం పాట్నాలో ఆదివారంనాడు జిల్లా, బ్లాక్ స్థాయి ఆఫీస్ బేరర్లతో సమావేశం నిర్వహించారు. రాజకీయ వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిషోర్ 'బీహార్‌లో మార్పు' పేరుతో 'జన్ సురాజ్' క్యాంపయిన్‌ను కొద్దికాలం క్రితం ప్రారంభించారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి తదితర కీలకాంశాల్లో అవగాహన కలిగించేందుకు అట్టడుగుకు స్థాయి ప్రజానీకం వరకూ తన ప్రచారాన్ని తీసుకువెళ్లారు. గాంధీ జయంతి రోజునే… మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదే రోజు తన రాజకీయ పార్టీని ప్రారంభించాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం 'జన్ సురాజ్' లక్ష్యంగా ఉంది.
నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత కనిపిస్తుండటం, ఆర్జేడీ కేవలం తమ సంప్రదాయ ముస్లిం ఓట్ బ్యాంక్‌ను నిలబెట్టుకోవడం మినహా మరింత విస్తరించలేకపోకపోవడం వంటివి తమ కొత్త పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా 'జన్ సురాజ్' భావిస్తున్నట్టు తెలుస్తోంది. జన్ సురాజ్ ప్రచారానికి దూరంగా ఉండాలని తమ కార్యకర్తలకు ఆర్జేడీ ఇటీవల హెచ్చరించింది. దీనిపై 'జన్ సురాజ్' వెంటనే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కౌంటర్ ఇచ్చింది. బీహార్‌లో బలమైన పార్టీగా ఉన్నట్టు చెప్పుకునే ఆర్జేడీ తాము (జన్ సురాజ్) రాజకీయ పార్టీ పెడుతున్నామని ప్రకటన చేసినందుకే కలవరపడుతోందని వ్యాఖ్యానించింది.