ఇండియా చెబుతోంది.. ప్రపంచం వింటోందన్న మోడీ…
అగ్రరాజ్యం అమెరికాలో భారత ప్రధానమంత్రి మూడురోజుల పర్యటన విజయవంతమైంది. ప్రతీ చోట, ప్రతీ సమావేశంలోనూ బ్రాండ్ మోడీ, బ్రాండ్ ఇండియా స్పష్టంగా కనిపించింది.క్వాడ్ సదస్సు అయితేనేమి, టాప్ కంపెనీల సీఈవోలతో సమావేశమయితేనేమి, ప్రవాసభారతీయులను ఉద్దేశించిన ప్రసంగం అయితే ఏమీ.. అన్నింటిలోనూ దేశ ప్రాధాన్యాన్ని మోడీ నొక్కి వక్కాణించారు. గతంలో మనం ప్రపంచం చెబితే వినేవాళ్లం.. అగ్రదేశాలను అనుసరించేవాళ్లం.. కానీ ఇప్పుడు తీరు మారింది.. మనం చెబితే.. ఈప్రపంచం వింటోందన్నారు మోడీ.
క్వాడ్ దేశాధినేతలతో సమావేశాలు
క్వాడ్ దేశాధినేతలతో విడివిడిగా మోడీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కారాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా అమెరికా వేదికగా .. మిత్రదేశం రష్యాకు గట్టి సూచనలే చేశారు. ఇది యుద్ధాల సమయం కాదు.. శాంతియుగమని స్పష్టం చేశారు. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతికోసం తమవంతుగా సహకరిస్తామని మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో చైనాపైనా మోడీ సునిశిత విమర్శలు చేశారు. అన్నిదేశాలతోనూ తాము సత్సంబంధాలుకోరుకుంటామన్నారు భారతప్రధాని.
మోడీ.. మోడీ.. నినాదాలు
ఈ క్రమంలో అక్కడ ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూయార్క్లో నిర్వహించిన భారీ ఈవెంట్లో మోడీ మాట్లాడారు. లాంగ్ ఐలాండ్ నస్సావూ కోలిజియం స్టేడియం మొత్త ఎన్నారైలతో నిండిపోయింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేవించి మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇండియా అభివృద్ధిని వివరించారు. భారత్–అమెరికా సంబంధాలను తెలియజేశారు. ఎన్నారైలను మెచ్చుకున్నారు. మీరే ఇండియా బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రశంసించారు. మీ కారణంగానే ఇండియా అమెరికా సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఏఐ అంటే అందరికీ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ గుర్తుకు వస్తుందని తనకు మాత్రం ఏఐ అంటే అమెరికా ఇండియా గుర్తొస్తాయని తెలిపారు.
అనుసరించే రోజులు పోయాయి..
ఇక భారత్ గతంలో అభివృద్ధి చెందిన దేశాలను అనుకరించేదని, ఇప్పుడు ఆ రోజులు పోయాయన్నారు. శాసించే స్థాయికి భారత్ ఎదగిందని వెల్లడించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదని, రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నామన్నారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెచ్చుకున్నారు. తన సొంత ఊరు డెలావెర్లో మోడీకి ఆతిథ్యం ఇచ్చిన బైడెన్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
టాప్ సీఈవోలతో భేటీ..
ప్రవాసుల మెగా ఈవెంట్ తర్వాత మోడీ న్యూయార్క్లో జరిగిన టాప్ సీఈవోల రౌంట్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో అమెరికాలోని ప్రముఖ కంపెనీల వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కల్పించే సౌకర్యాలను వివరించారు.
ఐక్యరాజ్యసమితిలో మోడీ ప్రసంగం
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.., ‘మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఔచిత్యానికి మెరుగుదల కీలకం’ అని అన్నారు.






