Putin: నాడు ఆరస్ సెనెట్… నేడు ఫార్చ్యూనర్.. మోడీ, పుతిన్ కలసి ప్రయాణం..
దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా స్వాగతం పలికారు. పాలం విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించగా.. ఇప్పుడా వాహనం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోడీ (PM Modi) తాను వాడే విలాసవంతమైన రేంజ్‌రోవర్ కారును పక్కనపెట్టి మరీ.. ఒక సాధారణ ఫార్చ్యూనర్‌లో పుతిన్‌ను తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది (Putin India Tour).
ఈ టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) సిగ్మా 4 ఎంటీ వాహనం MH01EN5795 మహారాష్ట్ర నంబరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ బీఎస్-6 వాహనం 2024 ఏప్రిల్‌లో రిజస్టర్ అయినట్లుగా తెలుస్తోంది. 2039 ఏప్రిల్ వరకు ఈ వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ చెల్లుతుంది. రష్యా అధినేతను తీసుకెళ్లేందుకు మోడీ ఈ కారు వాడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికితోడు పుతిన్ కూడా తన ఆరస్ సెనేట్ లిమోసిన్‌లో కాకుండా ఫార్చ్యూనర్‌లో ప్రయాణించేందుకు అంగీకారం తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణాలు సాగించే ఇద్దరు దేశాధినేతలు.. భద్రతా ప్రమాణాలకు భిన్నంగా ఒక సాధారణ కారులో ప్రయాణించడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.
మరోవైపు…ఈ ఏడాది ఆరంభంలో షాంఘై సహకార సదస్సు (SCO) ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladmir Putin) ఒకే కారులో ప్రయాణించారు. కలిసి ద్వైపాక్షిక భేటీ వద్దకు చేరుకున్నారు.
కాగా, ఎస్సీఓ కాన్ఫరెన్స్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న రిట్జ్-కార్లటన్ హోటల్ వరకూ మోడీతో కలిసి ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ భావించారు. మోడీ కోసం 10 నిమిషాల పాటు వేచి చేశారు. ‘ఇద్దరు నేతలు కారులో ప్రయాణిస్తూ వివిధ అంశాలను ముచ్చటించుకున్నారు. ద్వైపాక్షిక సమావేశ వేదికకు చేరుకున్న తర్వాత కూడా ఇరువురూ మరో 45 నిమిషాలు కారులోనే సంభాషించుకున్నారు. ఆ తర్వాత ద్వైపాక్షిక భేటీ గంటకు పైగా జరిగింది’ దీంతో ఆసమయంలోనే వీరి స్నేహంపై చైనా సహా అంతర్జాతీయ పత్రికలు ప్రధానంగా ప్రస్తావించాయి.






