Islamabad: భారత్ దండెత్తితే..? రష్యా, చైనా శరణు కోరుతున్న పాక్…

Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం పాకిస్తాన్‌ని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు, భారత్ సైనిక చర్యకు దిగవచ్చనే భయం ఆ దేశంలో ఉంది. బయటకు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి, అంతర్గత సమస్యలు, ఆర్మీలో గ్రూపులు అన్ని కూడా ఆ దేశానికి ప్రతీకూలంగానే ఉన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి, పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత్ కఠిన చర్యలు చేపట్టడంతో.. ఈ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పహల్గాం ఉగ్రదాడి అంశంలో రష్యా(Russia), చైనా(china) జోక్యం చేసుకోవాలని, భారత్ చెబుతున్నది నిజమా, అబద్ధమా తేల్చాలని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. రష్యా అధికారిక వార్తా సంస్థ ‘ఆర్‌ఐఏ నొవొస్తి’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్‌లో జరిగిన ఘటన కుట్రదారులు ఎవరో తేలుద్దాం. రష్యాగానీ, చైనాగానీ, యూరోపియన్ దేశాలుగానీ ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషించగలవని అనుకుంటున్నాను. ఆ దేశాలు ఒక విచారణ బృందాన్ని నియమించి.. భారత్, మోడీ నిజం చెప్తున్నారా, అబద్ధం చెబుతున్నారా అన్నదానిపై దర్యాప్తు చేయాలి. అసలు విషయం ఏమిటో అంతర్జాతీయ బృందంతో తేల్చాలి..’’ అని పేర్కొన్నారు.
పాకిస్తాన్ కు చైనా అండ..
పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపడుతున్న చర్యలను తాము క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని.. ఈ అంశంలో పాకిస్థాన్‌కు అండగా ఉంటామని చైనా పేర్కొంది. పాక్ ఉప ప్రధాని మహమ్మద్ ఇషాక్‌తో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ మేరకు భరోసా ఇచ్చారు. ‘‘చైనా మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్థాన్ భద్రత గురించిన ఆందోళనను మేం అర్థం చేసుకోగలం. పాక్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడంలో అండగా ఉంటాం. పహల్గాం దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలన్న పాక్ డిమాండ్‌కు మద్దతు ఇస్తాం’’ అని పేర్కొన్నారు.