Pakistan: ఓ వైపు విజ్ఞప్తులు.. మరోవైపు బెదిరింపులు.. పాక్ మేకపోతు గాంభీర్యం..

పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ (Pakistan) ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడింది. ముఖ్యంగా దాడికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని భారత్.. ప్రపంచదేశాలకు పంపించింది. ఫలితంగా ఇప్పుడు పాకిస్తాన్ మిత్రదేశాలు సైతం నోరెత్తలేని పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు భారత్(India) లాంటి బలమైన ఆర్మీ కలిగిిన దేశంలోకి ఎవరో స్వతంత్ర సమరయోధులు వచ్చి పోరాడారని. పాక్ చెబుతున్న కాకమ్మ కబుర్లను ప్రపంచదేశాలు పట్టించుకోవడం లేదు. అలా అనడం కన్నా, నమ్మడం లేదు. దీనికి తోడు అమెరికా, రష్యా లాంటి అగ్రదేశాలు ముష్కరుల వేటలో సహకరిస్తామంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాకిస్తాన్ కు అర్థం కావడం లేదు.
ఓవైపు భారత్ సింధూజలాలను నిలిపివేస్తే.. యుద్ధానికి దారితీసినట్లే అని పాకిస్తాన్ ప్రధాని, మంత్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈఘటనతో తమకు సంబంధం లేదంటున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్(Shehabaz).. తృతీయ పక్షంతో నిష్పాక్షిక విచారణకు సిద్ధమన్నారు. అంటే ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడి ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సి ఉంది.
మరోవైపు.. పాకిస్తాన్ మంత్రులేమో.. మేకపోతు గాంభీర్యంతో ప్రకటనలు చేస్తున్నారు.భారత్‌పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితోపాటు ఘోరీ, షహీన్, ఘజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధూ జలాలను నిలిపివేస్తే.. పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపర్చామని.. భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
పాకిస్థాన్ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను న్యూఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. రెండ్రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందన్నారు. మరో 10 రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని చెప్పారు. అంతేకాదు.. ఇబ్బందులు ఎదుర్కోవడానికి తామూ సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
అంతకు ముందురోజే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం వంటి చెత్త పనులన్నీ పశ్చిమదేశాల కోసం చేశామని పాకిస్థాన్ అంగీకరించింది. ఇది పొరపాటేనని, ఆ పర్యవసానాలతో తమ దేశం ఇబ్బందులకు గురవుతోందని వాపోయారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేది. ఆపై 9/11 దాడుల తర్వాత ఇదే పరిస్థితి ఎదురైంది. పాక్‌లోని గత ప్రభుత్వాలు తప్పులు చేశాయని భావిస్తున్నాను’’ అని అన్నారు.