Bihar: పదోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్.. ?
బిహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar).. రికార్డు స్థాయిలో పదోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రెండు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయదుంధుబి మోగించింది. బీజేపీ నేతలు కూడా ఊహించని విధంగా సానుకూల ఫలితాలు వెలువడ్డాయి..
నితీష్ కుమార్ ప్రస్థానం…!
పట్నా సమీపంలోని ఓ భక్తియార్పుర్లో 1951లో నితీష్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. బీహార్ ఇంజినీరింగ్ కాలేజ్ (ప్రస్తుతం పట్నా ఎన్ఐటీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన నితీష్.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే లాలూ ప్రసాద్, సుశీల్ కుమార్ మోడీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది. 1985 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటికీ.. నితీష్ లోక్‌దళ్ పార్టీ తరఫున హర్నౌత్ నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఐదేళ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. బీహార్‌లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతోన్న తరుణంలో జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం వారం రోజులే (2000 మార్చి 3- 10) కొనసాగారు. అనంతరం జనతాదళ్ (యునైటెడ్)ను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
2005లో బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్.. మొదటి ఐదేళ్లలో దూకుడుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై దాడులు, డబ్బుల కోసం కిడ్నాప్లతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో శాంతిభద్రతలను గాడిన పెట్టి విమర్శకుల మన్ననలు పొందారు. బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతూనే ముస్లిం (పస్మందా) వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. 2014 మే వరకు అధికారంలో కొనసాగారు. 2013లో బీజేపీకి బ్రేకప్ చెప్పిన నితీష్ కుమార్.. కాంగ్రెస్, సీపీఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో తొమ్మిది నెలలపాటు జితన్‌రామ్ మాంఝీ సీఎంగా కొనసాగారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిపి మహా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.
అది రెండేళ్లపాటే కొనసాగింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్న నితీష్.. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం బీజేపీనే అని భావించిన నితీష్ కుమార్.. 2022లో మళ్లీ ఎన్డీఏను వీడారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన.. సీఎంగా బాధ్యతలు చేపట్టి 18నెలలు గడవక ముందే మళ్లీ కాషాయ పార్టీతో దోస్తీకి సై అన్నారు. మిత్రపక్షాలను మార్చడం ద్వారా బీహార్‌లో సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగుతున్న నితీష్ కుమార్.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నితీష్ అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ‘ఇండియా’ కూటమిని వీడి తిరిగి ఎన్డీయే గూటికి చేరి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.






