బైడెన్, నెతన్యాహు దొందుకు దొందే..
హమాస్ పై పోరులో భాగంగా గాజాను నేలమట్టం చేస్తోంది ఇజ్రాయెల్. మొన్నటివరకూ హమాస్ నేతలున్నారంటూ భూగర్భంలోని టన్నెల్స్ ను టార్గెట్ చేసింది. వేలాదిమంది హమాస్ కార్యకర్తలను హతమార్చింది. అయితే ఇప్పటివరకూ బంధీల విడుదలలో మాత్రం చెప్పుకోదగిన ఫలితం కనిపించలేదు. చాలా మంది ఇప్పటికీ హమాస్ చెరలోనే ఉన్నారు. హమాస్ నేతల ఏరివేత కొనసాగుతుండడంతో.. బంధీల్లో ఎంతమంది బతికున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇది సహజంగానే ఇజ్రాయెల్ పౌరుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తమవారిని విడిపించాలంటూ వారు.. నెతన్యాహు సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు.
మరోవైపు హమాస్ పై విజయం సాధించడమే లక్ష్యమంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అయితే ఈ పోరులో వేలాది మంది అమాయక గాజా పౌరులు బలవుతున్నారు. ఒకనాడు తమ మానాన తమ జీవితాలు గడిపిన లక్షలాది మంది గాజావాసులు… ఇప్పుడు బ్రెడ్ ముక్క కోసం, ఎగబడుతున్నారు మరీ ముఖ్యంగా చిన్నారులకు తగిన ఫుడ్ పెట్టలేక, వారు కళ్లముందే చనిపోతుంటే.. కన్నీటి చుక్క కార్చడం మినహా ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది. దీన్ని ప్రపంచమంతా ఖండిస్తోంది. అయితే ఇజ్రాయెల్ కు ఈ దురాక్రమణ ఆపమని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ఇజ్రాయెల్ కు వెన్నుదన్నుగా ఉంటున్న అమెరికా సైతం సుద్దులు చెబుతోంది. తప్పా మద్దతివ్వమని ఒక్క మాట అనలేకపోతోంది.
హమాస్‌తో పోరు విషయంలో నెతన్యాహు తీరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పుపట్టారు. పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్ నిబంధనలు ఉల్లంఘస్తోందన్నారు. బెంజమిన్ వైఖరి సొంత దేశాన్నే గాయపరుస్తోందని ఆక్షేపించారు. అంతే కాదు.. తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయెల్ పార్లమెంటులోనే వ్యక్తపరుస్తానన్నారు బైడెన్. మరోవైపు…బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టారు. ‘నేను మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే.. అది పూర్తిగా తప్పు’ అని వ్యాఖ్యానించారు.
హమాస్ లెక్కల ప్రకారం.. గాజాలో 31వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య గురించి ప్రశ్నించగా..అది నాకెలా తెలుస్తుంది. మా సైనికులు 13వేలమంది మిలిటెంట్లను హతమార్చారన్నారు నెతన్యాహు. దాదాపు 1.3 మిలియన్ల పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని చెప్పారు.






