Justice Swaminathan: న్యాయవ్యవస్థపై ‘రాజకీయ’ కత్తి..!
తమిళనాడులో (Tamilnadu) మతం, రాజకీయాలు, న్యాయవ్యవస్థ మధ్య జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఒక ఆలయం బయట భక్తులు దీపం వెలిగించుకోవచ్చని తీర్పు ఇచ్చినందుకు, ఏకంగా ఒక హైకోర్టు (High Court) న్యాయమూర్తిపైనే అధికార పార్టీ అభిశంసన (Impeachment) అస్త్రాన్ని ప్రయోగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ (Madhurai Bench) న్యాయమూర్తి జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్‌పై డీఎంకే (DMK), దాని మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు కలిసి అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వడం… న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే చర్యగా మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధురైకి సమీపంలోని ప్రసిద్ధ తిరుపరంకుండ్రం (Tiruparamkundram) సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద ఈ వివాదం రాజుకుంది. ఆలయం వెలుపల ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించేందుకు అనుమతినివ్వాలని భక్తులు కోరారు. అయితే, అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, శాంతిభద్రతల సమస్య ఉందనే కారణాలతో పోలీసులు, ఆలయ నిర్వాహకులు దీనిని అడ్డుకున్నారు. ఈ విషయం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ముందుకు వెళ్ళింది. విచారణ జరిపిన జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్… “మతపరమైన ఆచారాలను పాటించడం భక్తుల ప్రాథమిక హక్కు. దీపస్తంభం వద్ద దీపం వెలిగించడం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగదు” అని స్పష్టం చేస్తూ, భక్తులకు అనుమతినిస్తూ తీర్పునిచ్చారు.
సాధారణంగా కోర్టు తీర్పును ప్రభుత్వాలు గౌరవించి అమలు చేస్తాయి. కానీ, తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయలేదు. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. డివిజన్ బెంచ్ ఆదేశించినా కూడా అధికారులు పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని అభిశంసన నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జస్టిస్ స్వామినాథన్ గతంలోనూ ప్రభుత్వ విధానాలను, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యూట్యూబర్ మారిదాస్ కేసులోనూ, ఇతర భావప్రకటనా స్వేచ్ఛ కేసుల్లోనూ ఆయన ఇచ్చిన తీర్పులు డీఎంకే ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ఇప్పుడు దీపస్తంభం తీర్పు సాకుగా చూపి, డీఎంకే ఎంపీలు ఆయనపై పార్లమెంటులో అభిశంసన తీర్మానానికి నోటీసు ఇచ్చారు. దీనికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు సంతకాలు చేయడం… ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని స్పష్టం చేస్తోంది. ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు నచ్చకపోతే పై కోర్టుకు వెళ్లాలి కానీ, ఇలా న్యాయమూర్తి శీలాన్నే శంకించడం, ఆయనపై పార్లమెంటులో చర్యలకు ఉపక్రమించడం కక్షసాధింపు చర్యగానే కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేవి మూడు ప్రధాన స్తంభాలు. ఒకదాని పరిధిలో మరొకటి జోక్యం చేసుకోకూడదు. కానీ, ఇక్కడ రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయమూర్తులను భయభ్రాంతులకు గురిచేసే చెడు సంప్రదాయానికి తెరలేపుతున్నాయి. భవిష్యత్తులో ఏ న్యాయమూర్తి అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదా ప్రజల హక్కులకు మద్దతుగా తీర్పు ఇవ్వాలంటే భయపడే పరిస్థితిని ఇది కల్పిస్తుంది. రాజ్యాంగం న్యాయమూర్తులకు రక్షణ కల్పించింది నిర్భయంగా తీర్పులు ఇవ్వడానికే. కానీ, ఇలాంటి రాజకీయ కూటములు ఆ రక్షణ కవచాన్ని బద్దలు కొట్టాలని చూడటం ప్రమాదకరం.
ఈ మొత్తం ఎపిసోడ్లో సెక్యులరిజం నిర్వచనంపై మరోసారి చర్చ మొదలైంది. హిందూ ఆలయాల సాంప్రదాయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ, భక్తుల మనోభావాలను కాపాడాలని కోర్టు చెబితే, దానిని మతతత్వంగా ముద్ర వేయడం విడ్డూరంగా ఉంది. జస్టిస్ స్వామినాథన్‌ను బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ మనిషిగా ముద్ర వేసే ప్రయత్నం డీఎంకే వర్గాలు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే తీర్పు మైనారిటీ ప్రార్థనా స్థలాలకు సంబంధించి ఇచ్చి ఉంటే, ఈ పార్టీలు ఇలాగే స్పందించేవారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం హిందూ ధార్మిక అంశాలకు మద్దతుగా తీర్పు వచ్చినందుకే, ఆయనను టార్గెట్ చేయడం సూడో సెక్యులరిజం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
జస్టిస్ స్వామినాథన్ తీర్పులో న్యాయపరమైన లోపాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉంది. కానీ, ఆ మార్గాన్ని ఎంచుకోకుండా, రాజకీయ బలంతో న్యాయమూర్తిని పదవి నుండి తొలగించే ప్రయత్నం చేయడం అంటే… “మా మాటకు తలొగ్గని న్యాయమూర్తులు బెంచ్‌పై ఉండకూడదు” అని హెచ్చరించడమే అవుతుంది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గొడ్డలి పెట్టు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రం, ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. ఈ విషయంలో డీఎంకే కూటమి వైఖరి ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసేలా ఉందన్నది కాదనలేని సత్యం.






