Rahul Gandhi: ఈసీ ఎంపికలో సీజేఐ ఎందుకు లేరు? మోదీ సర్కార్కు రాహుల్ గాంధీ ప్రశ్న
లోక్సభ వేదికగా ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ రణరంగాన్ని తలపించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVM) విశ్వసనీయత, ఎన్నికల సంఘం (EC) పారదర్శకతపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈవీఎంల స్థానంలో మళ్లీ పాత బ్యాలెట్ విధానాన్నే తీసుకురావాలని డిమాండ్ చేశాయి. ఎస్ఐఆర్ మాటున ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపణలు గుప్పించాయి.
ఈ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అమెరికా కంటే గొప్పదైన మన ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల చోరీకి పాల్పడటం అంటే అంతకంటే పెద్ద దేశద్రోహం మరొకటి ఉండదని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ సంస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తీసుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి రాహుల్ మూడు సూటి ప్రశ్నలు సంధించారు.
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)ని ఎందుకు తప్పించారు? కమిషనర్లు విధుల్లో ఉండగా చేసిన తప్పులకు వారిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోకూడదనే రక్షణ కవచం లాంటి చట్టం ఎందుకు తెచ్చారు? పోలింగ్ సీసీటీవీ ఫుటేజీని కేవలం 45 రోజుల్లోనే డిలీట్ చేయవచ్చనే నిబంధన ఎందుకు పెట్టారు? అని రాహుల్ (Rahul Gandhi) ప్రశ్నించారు.






