Kavitha: పార్టీ పెట్టడం ఖాయం..పేర్లు పరిశీలిస్తున్న కవిత..

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ (KCR) కుటుంబంలో అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత రాసిన ఓ లేఖ లీకేజీ అయిన సంఘటన, బీఆర్ఎస్‌లో ఆమె అసంతృప్తి, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు ఈ వివాదానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి.
మే 2, 2025న కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ (Kaviha Letter) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం బయటకు వచ్చింది. ఈ లేఖలో కవిత, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తీరును విమర్శించారు. బీజేపీపై కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడం, వక్ఫ్ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావించకపోవడం వంటి అంశాలను ఆమె ఎత్తి చూపారు. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య పొత్తు పెట్టుకోవచ్చనే అనుమానాలు కార్యకర్తల్లో నెలకొన్నాయని కవిత లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ లేఖ ఎలా లీక్ జరిగిందనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఈ లీకేజీపై సీరియస్‌గా ఉన్నారని, పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దీనిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
పార్టీ హైకమాండ్ లేఖ లీకేజీకి బాధ్యులెవరో తేల్చే వరకు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కవిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. కవిత బీఆర్ఎస్‌లో ఒంటరిగా మారారని, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో కొడుకు కేటీఆర్‌కు రాజకీయ వారసుడిగా ప్రాధాన్యత ఇవ్వడం, కవితను దూరం పెట్టడం వంటి అంశాలు ఆమె అసంతృప్తికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రజతోత్సవ సభలో కేటీఆర్ (KTR) ఫోటోను మాత్రమే వేదికపై ఉంచడం ఈ అనుమానాలను బలపరిచింది.
కవిత గత కొన్ని నెలలుగా బీసీ రిజర్వేషన్లు, సామాజిక తెలంగాణ వంటి అంశాలపై సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సంస్థ భారత జాగృతి (Bharatha Jagruthi) ఆధ్వర్యంలో కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకుడు సామా రామ్మోహన్ రెడ్డి, కవిత కొత్త పార్టీ పెడితే స్వాగతిస్తామని ప్రకటించడం గమనార్హం. కవితను సస్పెండ్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని, ఆ తర్వాత ఆమె కొత్త పార్టీ పెట్టడం ఖాయమని ఆయన వెల్లడించారు.
కవిత సన్నిహితులు ఆమె కొత్త పార్టీ పెట్టే దిశగా పేర్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. బీసీ సామాజిక వర్గాలు, మహిళా సమానత్వం, సామాజిక తెలంగాణ వంటి అంశాలను కేంద్రంగా చేసుకుని ఆమె రాజకీయ ఎజెండాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పెట్టాలనుకుంటే మొదటి ఆప్షన్ గా తెలంగాణ జన జాగృతిని (Telangana Jana Jagruthi) పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. లేదంటే బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి (Bahujana Telangana Rashtra Samithi) పేరు కూడా పరిశీలనలో ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.